ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ చైర్మన్ గా డాక్టర్ పున్నూరు గౌతమ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ లోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో సోమవారం గౌతమ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతిప్రకాశనంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం విధానాలలో మంచి,చెడును కలిపి చూపించే దర్పణంలా ఉండే మీడియారంగంలో పనిగట్టుకుని ప్రభుత్వంపై బురద జల్లేందుకు కొన్ని ఛానళ్లు ప్రయత్నిస్తున్నాయని గౌతంరెడ్డి ఆరోపించారు. అసత్య ప్రచారాలను నియంత్రించేందుకు మంత్రులు పెద్దిరెడ్డి, పేర్నినాని, కొడాలి నానిలతో ఏర్పడిన కమిటీ తరపున ఇప్పటి వరకు పనిచేశానని చెప్పారు. ఈ కమిటీ సూచన మేరకు ఫైబర్ నెట్ చైర్మన్ పదవిని పొందినందుకు ఆనందంగా ఉందన్నారు. సీఎం జగన్ సాంకేతిక విప్లవానికి నాంది పలికారని, నెట్ అందరికీ అందుబాటులో ఉండాలని, మారుమూల ప్రాంతానికి విస్తరించాలని ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆశయానికి అనుగుణంగా కృషి చేస్తానని అన్నారు.
                                                          అసత్య ప్రచారాలను, బురద జల్లే ప్రసారాలను నియంత్రిస్తూ ప్రజా సంక్షేమానికి పాటుపడతానని గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి , దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు , సమాచార రవాణా శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) , పౌర సరఫరాల శాఖా మంత్రి కొడాలి  శ్రీ వెంకటేశ్వరరావు (నాని), ప్రభుత్వ చీఫ్ విప్ సామినేని ఉదయభాను , పెడన శాసనసభ్యులు జోగి రమేష్ , స్థానిక నాయకులు బొప్పన భవకుమార్ , దేవినేని అవినాష్ ,  హాజరయ్యా గుప్తా , ఏపీ ఫైబర్ నెట్ ఎండీ మధుసూధనా రెడ్డి లు పలువురు ప్రజాప్రతినిధులు, కేబుల్ నెట్ ఆపరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
                                                                                        స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ గా పున్నూరు గౌతమ్ రెడ్డిని నియమిస్తూ వారం రోజుల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఏపీ ఫైబర్ నెట్ ఎండీకి ఆదేశాలిచ్చింది. పెట్టుబడులు, మౌలిక సదుపాయల కల్పనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల వలెవన్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా సోమవారం సైట్ ఫైబర్ నెట్ చైర్మన్ గా గౌతంరెడ్డి బాధ్యతలు తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: