ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హిందువుల మనోభావాలకు అనుగుణంగా భక్తులను తరింప చేసే తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణానికి ముందే నూతన రథాన్ని సిద్దం చేయడం జరిగిందని మంత్రి వెలంప‌ల్లి తెలిపారు. సొమ‌వారం బ్రాహ్మణ‌ వీధిలో మంత్రి క్యాంపు కార్యాల‌యంలో మంత్రి  వెల్లంప‌ల్లి శ్రీ‌నివాసరావును దేవ‌దాయ శాఖ డిప్యూటి క‌మిష‌న‌ర్ విజ‌య‌రాజు, ఏసీ భద్రాజీ, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ‌నివాస కిర‌ణ్‌, స్థానచార్యులు ‌రంగ‌చార్యులు, ర‌మేష్ త‌దిత‌రులు క‌లిసి మంత్రిని అంత‌ర్వేది ర‌థం సంప్రోక్ష‌ణ‌కు రావల‌సిందిగా ఆహ్వ‌నించారు.
                    ఫిబ్రవరిలో మూడు రోజుల పాటు నూత‌న ర‌థానికి వైఖాసన ఆగమ సాంప్రదాయం ప్ర‌కారం సంప్రోక్ష‌ణ నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఫిబ్రవరి 11న సంకల్పం, 12న ఆదివాసం, 13న అభిషేకం, పూర్ణాహుతి, ర‌థ‌ ప్ర‌తిష్ఠ జ‌రుగుతుంద‌ని మంత్రి చెప్పారు. 22న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం అనంత‌రం 23న కల్యాణోత్సవ రథం ఊరేగింపు క‌నుల పండుగగా జ‌రుగుతుంద‌ని వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
                              2020 సెప్టెంబర్ లో అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రాంగణంలోని కల్యాణోత్సవ రథం దగ్ధం అయింది. అర్థరాత్రి దాటాక ఒంటిగంట సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పడు ఈ ఘటన పెను దూమారం రేపింది. ఆలయంలోని రథం దగ్ధం కావడం స్థానికులతో పాటు భక్తులను ఆందోళనకు గురిచేసింది. అయితే ప్రమాదవశాత్తూ రథం మంటలు అంటుకుని దగ్ధమైందా..లేక ఎవరైనా దహనం చేశారా అనే దానిపై పోలీసులు రంగంలోకి దిగారు. షెడ్డులో ఉంచిన స్వామివారి రథం ఎలా దగ్ధమైందన్న దానిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రతిపక్షాలు, కొందరు రాజకీయ నాయకులు సైతం ఈ విషయంపై భగ్గుమన్నారు. దీంతో అధికారపక్షం అప్రమత్తమైంది. ఈ ఘటనపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విచారణకు ఆదేశించారు. రథం పున:నిర్మాణానికి చర్యలు చేపట్టాలని దేవాదాయ శాఖ కమిషనర్ కు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అప్పుడే ఆదేశించారు.
                                  ఇటీవల ఆలయల్లోని విగ్రహాల ధ్వంసం ఘటనలు వరుసగా జరుగుతున్న సంగతి తెలిసిందే. హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశాలు పట్ల చిత్తశుద్ధితో ఉన్నామనే భావన కల్పించే పనిలో వైసీపీ ప్రభుత్వం నిమగ్నమైంది. ఈ క్రమంలో ఇటీవల గోపూజోత్సవం కార్యక్రమాన్ని సీఎం జగన్ నిర్వహించారు. ఇప్పుడు అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణానికి ముందే నూతన రథాన్ని సిద్ధం చేయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: