రాజకీయాల్లో అవకాశాన్ని బట్టి నేతలు పార్టీలు మారిపోవడం సహజం. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నవారు, అధికార పక్షంలోకి జంప్ అయిపోతారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, అప్పటివరకు ఒక పార్టీలో ఉంటూ, మరో పార్టీ అధినేతని తిడతారు. ఇక చివరికి ఎవరినైతే తిడతారో ఆ నాయకుడు పార్టీలోకి వెళ్తారు. మళ్ళీ అక్కడకెళ్లి మాజీ అధినేతపై ఫైర్ అవుతారు. పదవులు దక్కించేందుకు నానా పాట్లు పడతారు.

ఇక ఈ ప్రక్రియ అంతా ఏపీ రాజకీయాల్లో కామన్. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా, జగన్‌ని తిట్టినవాళ్లు, ఇప్పుడు అదే జగన్ పార్టీలోకి వెళ్ళి చంద్రబాబుని తిడుతున్నారు. అధికార పార్టీలో పదవులు నిలబెట్టుకోవడానికి కొందరు, పదవులు సంపాదించుకోవడం కోసం మరికొందరు ఈ రకమైన ఫీట్లు చేస్తుంటారు. ఇప్పుడు అదే పని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

గతంలో మాలమహానాడు ఛైర్మన్‌గా ఉన్న కారెం శివాజీ...2014లో చంద్రబాబు అధికారంలోకి రావడంతో, టీడీపీలో చేరారు. ఇక బాబు, శివాజీకి ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ పదవి ఇచ్చారు. ఆ పదవి ఉండగా శివాజీ ఎలాంటి రాజకీయం చేశారో అందరికీ తెలిసిందే. జగన్‌పై ఎలా విమర్శలు చేశారో కూడా అంతా చూశారు. ఇక 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయి, జగన్ అధికారంలోకి రావడంతో, శివాజీ పదవి కోల్పోయే ప్రమాదం వచ్చింది.

దీంతో శివాజీ పదవికి రాజీనామా చేసి, టీడీపీలో ప్రాధాన్యత లేదని, జగన్ పాలన చూసి ఆకర్షితులై వైసీపీలో చేరారు. వైసీపీలోకి వచ్చాక శివాజీకి ఎలాంటి పదవి దక్కలేదు. దీంతో శివాజీ అప్పుడప్పుడు మీడియా ముందుకొచ్చి జగన్‌కు సపోర్ట్‌గా, చంద్రబాబు టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు మత రాజకీయాలు చేస్తున్నారని, గతంలో ఎస్సీ, ఎస్టీలని టార్గెట్ చేశారని, ఇప్పుడు క్రైస్తవ మిషనరీలపై మాటల దాడి చేస్తున్నారని మండిపడుతున్నారు. అయితే ఏదొక పదవి పొందడానికే శివాజీ ఇలా చంద్రబాబుపై ఫైర్ అవుతున్నారని, అయినా శివాజీ మాటలు నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరని టీడీపీ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: