ఏపీలో జనసేన బలంగా ఉన్న ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా? అంటే చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే 2019 ఎన్నికల్లో జనసేన పెద్దగా ప్రభావం చూపలేదు. ఆ పార్టీ కేవలం రాజోలు సీటు మాత్రమే గెలుచుకుంది. ఇక ఆ ఎమ్మెల్యే ఇప్పుడు వైసీపీ వైపు వెళ్ళిపోయారు. అయితే ఎన్నికల్లో పశ్చిమగోదావరి, కృష్ణా, తూర్పుగోదావరి, విశాఖపట్నం లాంటి జిల్లాల్లో జనసేన కాస్త ఓట్లు తెచ్చుకుంది.

జనసేన ఇలా ఓట్లు తెచ్చుకోవడమే టీడీపీకి పెద్ద బొక్క పడింది. జనసేన ఓట్లు చీల్చేయడంతో అక్కడ టీడీపీకి ఓట్లు తగ్గి, వైసీపీ అభ్యర్ధులు గెలిచేశారు. అలా జనసేన దెబ్బ వల్ల గెలిచిన వైసీపీ నేతల్లో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఒకరు. వెల్లంపల్లి విజయవాడ వెస్ట్ నుంచి గెలిచారు. 2019 ఎన్నికల్లో వెల్లంపల్లి వైసీపీ నుంచి పోటీ చేసి సుమారు 58 వేల పైనే ఓట్లు తెచ్చుకున్నారు.

ఇక్కడ టీడీపే నుంచి పోటీ చేసిన జలీల్ ఖాన్ కుమార్తె షబానా 50 వేల పైనే ఓట్లు తెచ్చుకున్నారు. అలాగే జనసేన నుంచి పోటీ చేసిన  పోతిన మహేష్ 22 వేల పైనే ఓట్లు తెచ్చుకున్నారు. అంటే ఇక్కడ వెల్లంపల్లి మెజారిటీ 7,600 వరకు ఉంది. ఒకవేళ ఇక్కడ టీడీపీ-జనసేనలు కలిసి పోటీ చేసి ఉంటే, పరిస్తితి ఏంటనేది ఊహించుకోవచ్చు. అయితే అప్పుడు జనసేన ఓట్లు చీల్చడం వల్లే వెల్లంపల్లి సులువుగా విజయం సాధించేసి, ఇప్పుడు జగన్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేస్తున్నారు.

మంత్రిగా ఉన్న వెల్లంపల్లి, పవన్ కల్యాణ్‌పై ఎలాంటి విమర్శలు చేస్తున్నారో తెలిసిందే. అలాగే వరుసగా జరుగుతున్న ఆలయాల దాడుల విషయంలో వెల్లంపల్లి టార్గెట్ అవుతున్నారు. ఈ పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో వెల్లంపల్లిని ఓడించాలని జనసేన కసి మీద ఉంది. జనసేన నేత పోతిన మహేష్, నిత్యం వెల్లంపల్లిని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ మద్ధతు ఉంటుంది కాబట్టి, వెల్లంపల్లికి చెక్ పెట్టొచ్చని చూస్తున్నారు. అయితే టీడీపీతో గనుక పొత్తు ఉంటే వెల్లంపల్లి ఓటమి ఖాయమని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: