నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఉప ఎన్నిక తెలంగాణలో అధికార పార్టీగా ఉన్న టీఆర్ఎస్ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారింది.  ఇటీవల జరిగిన దుబ్బాక , గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించడంతో.. సిట్టింగ్ సీటు అయిన  నాగార్జున సాగర్ లో గెలవడం కారు పార్టీకి అత్యంత కీలకంగా మారింది. దీంతో నాగార్జున సాగర్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న సీఎం కేసీఆర్.. ఎలాగైనా గెలిచేలా వ్యూహాలు రచిస్తున్నారని తెలుస్తోంది. అందుకే అభ్యర్థి ఎంపికలోనూ ఆయన సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారని చెబుతున్నారు.  నాగార్జున సాగర్ నుంచి  ఏడు సార్లు విజయం సాధించారు కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి.  2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య చేతిలో ఆయన  ఓడిపోయారు.ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి మళ్లీ పోటీ చేయబోతున్నారు జానారెడ్డి.
 
           జానారెడ్డికి ధీటైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారట. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుటుంబ సభ్యులకే నాగార్జున సాగర్ టికెట్ ఇవ్వాలనే డిమాండ్ టీఆర్ఎస్ పార్టీలోని కొన్ని వర్గాల నుంచి వస్తోంది. అయితే దుబ్బాకలో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్యను బరిలోకి దింపడంతో ఉప ఎన్నికలో పార్టీ ఓడిపోయింది. దీంతో సాగర్ లో నోముల ఫ్యామిలీని బరిలోకి దింపే విషయంలో కేసీఆర్ ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి జానా రెడ్డి లాంటి ఉద్దండ నేత పోటీ చేస్తున్నందున.. అతనికి భగత్ సరితూగలేరనే చర్చ పార్టీ నేతల నుంచే వస్తోందని తెలుస్తోంది. ఆర్థికంగా, రాజకీయంగా, స్థానికంగా  బలవంతుడైన జానారెడ్డిని ఎదుర్కోవడం నోముల కుటుంబానికి సాధ్యం కాదనే అభిప్రాయానికి గులాబీ పెద్దలు వచ్చారని చెబుతున్నారు.

      నాగార్జున సాగర్ లో సినీ హీరో అల్లు అర్జున్ మామ కంజర్ల చంద్రశేఖర్ రెడ్డిని బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే ఆలోచన కేసీఆర్ చేస్తున్నారని చెబుతున్నారు. టీఆర్ఎస్ లో చాలా కాలంగా పని చేస్తున్న చంద్రశేఖర్ రెడ్డి నాగార్జున సాగర్ పరిసర ప్రాంతానికి చెందిన వారు. ఆర్థికంగా జానారెడ్డి సరితూగే వ్యక్తి. అంతేకాదు మెగాస్టార్ కుటుంబానికి దగ్గరి బంధువు కావడం ఆయనకు అదనపు అర్హత. నాగార్జున సాగర్ లో రెడ్డి సామాజిక వర్గానిదే ఆదిపత్యం. ఈ లెక్కన సాగర్ లో పోటీకి చంద్రశేఖర్ రెడ్డి సరైన వ్యక్తని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సాగర్ నియోజకవర్గంలో ఆంధ్రా సెటిలర్ల ఓట్లు కూడా వేలల్లోనే ఉన్నాయి. అల్లు అర్జున్ మామను బరిలోకి దింపితే ఈ ఓట్లు కూడా కలిసి వస్తాయని కేసీఆర్ లెక్కలు వేస్తున్నారని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: