తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ తీరుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రైతులను కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ఆరోపించారు. తనపై ఉన్న కేసుల రాజీ కోసమే కేంద్రంతో సీఎం కేసీఆర్ రాజీ పడ్డారని కోమటిరెడ్డి అన్నారు. కేసీఆర్ అవినీతి పై బీజేపీ  రాజీపడ్డా.. తాము వదిలిపెట్టి ప్రసక్తే లేదని చెప్పారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రైతుల ప్రయోజనాలపై కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ది ఉంటే.. మోడీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త సాగు  చట్టాలకు వ్యతిరేకంగా కేరళ  ప్రభుత్వ తరహా అసెంబ్లీ లో తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  రాష్ట్రంలో ఐకెపి సెంటర్ లు బంద్ పెడితే  టిఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు ఎమ్మెల్యేలను రైతులు ఉరికించి కొడతారని ఆయన హెచ్చరించారు.

 నాగార్జున సాగర్  అసెంబ్లీ ఉప ఎన్నికలో  కాంగ్రెస్ గెలవకపోతే రాజకీయాలు గురించి మాట్లాడనని చెప్పారు.  ఉపఎన్నికలు వస్తున్నాయనే నియోజకవర్గానికి కేసీఆర్ నిధులు మంజూరు చేస్తున్నారని విమర్శించారు. ఏడు సంవత్సరాలుగా సాగర్ ను పట్టించుకోని అధికార పార్టీ నేతలు.. ఇప్పుడు శంకుస్థాపనల పేరుతో హడావుడి చేస్తున్నారని భువనగిరి ఎంపీ మండిపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్  ఎన్నికల్లో  మత  రాజకీయాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు వచ్చాయని.. సాగర్ లో అలాంటి పరిస్థితి ఉండదని.. జానారెడ్డి గెలుపు ఖాయమని  కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
 
    యాదగిరిగుట్టలో రోడ్డు విస్తరణ బాధితులకు మద్దతుగా కాంగ్రెస్ నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షలకు సంఘీభావం తెలిపారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ సందర్భంగా  తన సొంతూరు చింతమడకకు చెందిన  వారు అమెరికాలో ఉన్నా  వారికి డబ్బులు ఇచ్చిన  కేసీఆర్.. యాదగిరిగుట్ట  రోడ్డు విస్తరణలో షాపులు, ఇండ్లు కోల్పోయిన వారికి ఎందుకు నష్టపరిహారం ఇవ్వడం లేదని కోమటిరెడ్డి ప్రశ్నించారు.యాదగిరిగుట్ట లో సీఎం  ఫామ్ హౌస్ రోడ్డు కోసం ఇండ్లు కోల్పోయిన బాధితులకు కూడా అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: