కరోనా వ్యాక్సినేషన్‌లో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడుతోంది భారత్‌. అంతేకాదు... ఉచితంగా టీకా అందిస్తున్న ప్రభుత్వం... వ్యాక్సినేషన్లో ఏకంగా రికార్డు సృష్టించింది. దేశీయంగా తయారయిన వ్యాక్సీన్ల వల్ల అతి స్వల్ప దుష్ప్రభావాలు కనిపించడం మరో విశేషం.
        
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. పలు దేశాల్లో తగ్గినట్టే తగ్గి... సెకండ్‌ వేవ్‌ రూపంలో విరుచుకుపడుతోంది. అయితే వైరస్‌ ప్రభావం ప్రారంభమై ఏడాది పూర్తయినా... ఇంత వరకూ దానికి ఖచ్చితమైన మందు కనిపెట్టలేకపోయారు. మరోవైపు.. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోడానికి ప్రపంచ వ్యాప్తంగా పలు ఫార్మా కంపెనీలు వ్యాక్సీన్ల తయారీపై ఫోకస్‌ పెట్టాయి.

సీరం ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేసిన కొవిషీల్డ్‌, భారత్ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకాలకు అత్యవసర వినియోగానికి అనుమతి లభించడంతో పక్కా ప్రణాళికతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించారు. మొదటి రోజే అత్యధికమందికి టీకా ఇచ్చి... ప్రపంచ రికార్డు నెలకొల్పింది భారత్‌.  

మన దేశంలో తొలి రోజు 2 లక్షల 7 వేల 229 మందికి వ్యాక్సీన్‌ ఇచ్చారు. అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌లో ఒకే రోజు వేసిన టీకాల సంఖ్య కంటే ఇది ఎక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ  తెలిపింది. అంతేకాదు... టీకా తీసుకున్న వాళ్లలో కేవలం 447 మందికి దుష్ర్పభావాలు కనిపించాయి. అవి  కూడా సాధారణమైన జ్వరం, తలనొప్పి, అలసట వంటివి మాత్రమే. అయితే... ముగ్గుర్ని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిచాల్సివచ్చింది.

ఇక రెండో రోజు 17 వేల 72 మందికి మాత్రమే వ్యాక్సిన్‌ అందించారు. ఆదివారం కావడంతో  ఆరు రాష్ట్రాల్లో 553 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగింది. ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, మణిపూర్‌, తమిళనాడు రాష్ట్రాల్లో టీకా పంపిణీ కొనసాగింది. దీంతో ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ తీసుకున్న వాళ్ల సంఖ్య 2 లక్షల 24 వేల 301కి చేరింది.  వ్యాక్సిన్‌ తీసుకున్న వారి ఆరోగ్య పరిస్థితిని  ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అధికారులు. వ్యాక్సిన్‌ పంపిణీపై అన్ని రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్య శాఖ సమీక్ష జరిపింది. తొలిరోజు ఎదురైన సమస్యలను గుర్తించారు. మున్ముందు టీకా పంపిణీలో అటువంటి సమస్యలు పునరావృత్తం కాకుండా చర్యలు చేపట్టారు అధికారులు.  

మరోవైపు దేశంలో కేసులు క్రమేపీ తగ్గుతున్నాయి. తాజాగా 7 లక్షల 79 వేల మందికి పరీక్షలు నిర్వహించగా, 15 వేల 144 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణైంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య కోటి 5 లక్షల 58 వేలకు చేరువలో ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2 లక్షల 8 వేల యాక్టివ్‌ కేసులున్నాయి. అలాగే, కరోనా  రికవరీ రేటు 96.58 శాతంగా ఉంటే, మరణాల రేటు 1.44 శాతంగా ఉంది. ఓ వైపు నిర్ధారణ పరీక్షల ద్వారా కరోనా సోకిన వాళ్లను గుర్తించి ఐసోలేషన్‌ చేస్తున్నారు. మరో వైపు వ్యాక్సీన్‌ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అందువల్ల మన దేశంలో కరోనా చైన్‌ను అత్యంత సమర్థవంతంగా బ్రేక్‌ చేసే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: