తెలంగాణలో బీజేపీ సత్తా చాటుతున్నట్లుగానే ఆంధ్రాలోనూ జోరు చూపించాలని తహతహలాడుతుంది. రాజకీయంగా తెలంగాణ పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు, ప్రజల స్థితిగతులు భిన్నం. తెలంగాణను వరుసగా రెండోసారి పాలిస్తున్న టీఆర్ఎస్ పై, సీఎం కేసీఆర్ పై కాస్తాకూస్తో ప్రజావ్యతిరేకత ఉండటం సహజం. అందులోనూ అక్కడ ప్రతిపక్షమైన కాంగ్రెస్ బలంగా లేకపోవడంతో బీజేపీ పుంజుకునేందుకు అవకాశం వచ్చింది. మరోపక్క ఆంధ్రాలో ఉంటే కుల రాజకీయాలు ఉన్నాయేమోగానీ మత రాజకీయాలు లేవనేది స్పష్టం. తెలంగాణలో పుట్టిన ఎంఐఎం ఇతర రాష్ర్టాలలోకి విస్తరించినా ఆంధ్రాలు అడుగు పెట్టలేకపోయింది. ముస్లిం ఆదిపత్యం ఉండటం వల్లనే.. దానిని ఎదుర్కోనే క్రమంలోనే తెలంగాణలో బీజేపీ విస్తరించగలుగుతుందని విశ్లేషకుల భావన.
                                                        ఆంధ్రాలో ఉన్న సీఎం జగన్ మొదటి సారి ముఖ్యమంత్రి అయ్యారు. 20 నెలల్లోనే జగన్ పై వ్యతిరేకత వచ్చేసిందనుకోవడం పొరపాటే అవుతుంది. మరోపక్క ఇళ్లస్థలాలు పంపిణీ, అమ్మ వడి, జగనన్న తోడు వంటి పథకాల అమలుతో జనానికి జగన్ దగ్గరగానే ఉన్నారని చెప్పవచ్చు. అయితే ఇటీవల ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం ఘటనలు జగన్ ప్రభుత్వానికి అపకీర్తి కలిగించేవిగా ఉన్నాయి. స్వతాహగా క్రిస్టియన్ అయినా జగన్ కావాలనే హిందూ ఆలయాలపై తన వర్గీయులతో దాడులు చేయిస్తున్నారనే విమర్శలు ప్రతిపక్షాలకు ఊతంగా మారాయి. అయితే తాను హిందూ మతానికి, ధర్మానికి వ్యతిరేకిని కాను అన్నట్లు ఆలయాల పునర్నిర్మాణం, గోపూజమహోత్సవం వంటి కార్యక్రమాలు జగన్ నిర్వహిస్తూ తనపై మచ్చ పడకుండా జాగ్రత్త పడుతున్నారు. జగన్ కు ఒకవేళ వ్యతిరేకత వచ్చినా.. అది ప్రతిపక్షమైన టీడీపీకి కలిసొస్తుందిగానీ ఒక్క సీటు కూడా లేని బీజేపీకి ఏ మాత్రం బలం అవ్వదు.
                                        ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టినందుకు కాంగ్రెస్ కు వరుస రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ ఒక్క సీటు కూడా ఆంధ్రులు గెలిపించలేదు. ఆంధ్రప్రదేశ్ కు విభజన హమీలో చెప్పినట్లుగా ప్రత్యేక హోదాను బీజేపీ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాంగ్రెస్ ఎంతో, బీజేపీ కూడా అంతే. పవన్ కల్యాణ్ వంటి సినీ గ్లామర్ ఉన్న నేత మద్దతుగా ఉన్నప్పటికీ బీజేపీకి ఒరిగేదేమి ఉండదని రాజకీయ విశ్లేషకులు అంచనా. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రెండు చోట్ల జనసేన అధినేత పోటీ చేసినా ఒక్క చోట కూడా గెలుపొందని పరిస్థితి తెలిసిందే. కనుక తిరుపతి స్థానంపై బీజేపీ పెట్టుకున్న ఆశ ఫలిస్తుందని ఎటువంటి లాజిక్ ఆధారంగానూ చెప్పలేం. పైపెచ్చు తిరుపతిలో ఏర్పాటుచేసిన సభలోనే ఆంధ్రాకు హోదా, ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణానికి సహకరిస్తానని మోదీ 2014 ఎన్నికల సమయంలో ప్రకటించారు. అనంతరం అది ఎంత వరకు అమలయ్యిందో అందరికీ తెలిసిందే. బీజేపీ మంత్రాలు తెలంగాణలో ఫలించినట్లు ఆంధ్రాలో ఫలించే పరిస్థితులు ఇప్పట్లో అయితే లేవని మేధావులు సైతం అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: