అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక ఎన్నికల వివాదం రోజు రోజుకూ ముదిరి పోతోంది. తాజాగా పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో జరుగుతున్న విచారణ ముగింపుకు వచ్చింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. ఎన్నికల కమిషన్‌, ప్రభుత్వం తరపున మొదటి రౌండ్‌ వాదనలు పూర్తయ్యాయి. ఎస్‌ఈసీ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ఆది నారాయణరావు వాదనలు వినిపించారు. నిమ్మగడ్డ తరపున సీనియర్ న్యాయవాది డీవీ సీతారామ్మూర్తి వాదనలు వినిపించగా.. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. రేపు ఎన్నికల కమిషన్‌ తరపు న్యాయవాదులు రిప్లై ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో విచారణను మంగళవారం ఉదయానికి ధర్మాసనం వాయిదా వేసింది.

స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ ను ఎన్నికల కమిషన్ ప్రకటించడంపై రాష్ట్ర  ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేసింది. అయితే ఈ పిటిషన్ ను హైకోర్టు సస్పెండ్ చేసింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇవ్వడంతో.. డివిజన్ బెంచ్‌కు ఎన్నికల కమిషన్ అప్పీల్ చేసింది. దీంతో సోమవారం ఏపీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి నేతృత్వంలోని బెంచ్.. ఈ కేసు విచారణను చేపట్టింది. సోమవారం మొదటి రౌండ్ వాదనలు విన్నది.

ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడే స్థానిక ఎన్నికలు వద్దని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. అయితే ఎలాగైనా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిమ్మగడ్డ.. స్థానిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఈ ఆదేశాలను అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుత కరోనా కాలంలో ఎన్నికల నిర్వహించడం ప్రమాదరకమని, కొంత కాలం ఎన్నికలు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. తాజాగా హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం కూడా.. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్‌కు స్థానిక ఎన్నికలు అడ్డుగా ఉంటాయని, కొంత కాలం ఆగాలని తీర్పునిచ్చారు. దీంతో ఎన్నికల కమిషన్ ఈ తీర్పును మరోసారి సవాల్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: