ప్రకాశం జిల్లాలో సోమవారం జరిగిన సంఘటన జనసైనికులనే కాకుండా జనసేనాని పవన్ కళ్యాణ్ ను కూడా ఆవేదనకు గురిచేసింది. నియోజకవర్గంలోని రోడ్డు సమస్యపై గిద్దలూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అన్నా రాంబాబును నిలదీసిన జనసేన పార్టీ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే... గ్రామంలోని రోడ్డు సమస్యపై నడిరోడ్డుపై కారు ఆపి నిలదీయడంతో ఎమ్మెల్యే రాంబాబు.. జనసేన కార్యకర్తను చెడమడా తిట్టారు. ‘‘నువ్వెవడివిరా నాకు చెప్పడానికి.. తమాషా పడుతున్నావా? ఒళ్లు దగ్గర పెట్టుకో.. నన్నే ప్రశ్నిస్తావా! నా వద్దకు వస్తూ మెడలో ఆ కండువా ఏంటి? కండువా తీసెయ్‌ ముందు. ఆ తర్వాత మాట్లాడు’’ అంటూ ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ఫైరయ్యారు. తీరా చూస్తే... ఎమ్మెల్యేను ప్రశ్నించిన జనసేన కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. స్వయంగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయం వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.



సమస్యలపై ప్రశ్నిస్తే ప్రాణాలు పోగొట్టుకోవలసిందేనా అని పవన్ కళ్యాణ్ భావోద్వేగం చెందారు. జనసేన కార్యకర్త బండ్ల వెంగయ్య నాయుడు ఆత్మహత్య బాధాకరమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెంగయ్య ఆత్మహత్యకు అధికార పక్షం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ‘‘వైసీపీ నిరంకుశ పాలనకు నిదర్శనమిది. గ్రామంలో పారశుద్ధ్య సమస్యపై ఎమ్మెల్యేను ప్రశ్నించడం తప్పా. కనీసం సమాధానం ఇవ్వలేని స్థితిలో ఎమ్మెల్యే రాంబాబు ఉన్నారా? ‘నీ మెడలో పార్టీ కండువా తీయ్...’ అని మొదలుపెట్టి సభ్యసమాజం పలకలేని భాషలో మాట్లాడతారా? ప్రశ్నించిన ఆ యువకుణ్ని ప్రజల మధ్యనే ఎమ్మెల్యే బెదిరించారు. వివిధ రూపాల్లో ఒత్తిళ్లకు గురి చేసినట్లు మాకు సమాచారం అందింది.’’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తమ గ్రామంలో సౌకర్యాల కోసం ప్రజత తరఫున గళమెత్తి ఎమ్మెల్యేను ప్రశ్నించడమే వెంగయ్య నాయుడు చేసిన తప్పా? అని పవన్ కళ్యాణ్ నిలదీశారు. అతను తన ఒక్కడి సౌకర్యం కోసం ప్రశ్నించలేదని.. ఊళ్లో ప్రజలందరి కోసం మాట్లాడారని పేర్కొన్నారు. ఆ గొంతు అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఎందుకు భయం పుట్టించిందని పవన్ ప్రశ్నించారు. ఆ భయంతోనే వెంగయ్య నాయుడు గొంతు నొక్కే పని ఆ క్షణం నుంచే అధికార పక్షం మొదలుపెట్టిందని ఆరోపించారు.వెంగయ్య నాయుడు మరణంపై సమగ్ర విచారణ చేయించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. అలాగే అధికార పక్షం ఈ ఆత్మహత్యకు బాధ్యత వహించాలన్నారు. వెంగయ్యను ఆత్మహత్యకు ప్రేరేపించిన ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వెంగయ్య నాయుడు కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని జనసేనాని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: