కార్పొరేషన్ ఎన్నికలకు ముందు ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ లో వర్గపోరు తీవ్రమైంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో  ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌  రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పార్టీ అధిష్టానం సైతం పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై ఆరా తీసినట్లు సమచారం. తన కార్యక్రమాలకు వస్తున్న ప్రజా ప్రతినిధులపై కక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నారని ప్రత్యర్థి వర్గాన్ని ఉద్దేశించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరించడం మంచిది కాదని కూడా చెప్పారు.  తాను ప్రస్తుతం ప్రజాప్రతినిదినీ కాదని.. ఎవరి పర్మిషన్ తీసుకోని రావాల్సిన అవసరం నాకు లేదనీ పొంగులేటి చేసిన వ్యాఖ్యలు ఖమ్మం జిల్లాతో పాటు టీఆర్ఎస్ పార్టీలోనూ పెద్ద దుమారమే రేపుతున్నాయి.

  పొంగులేటి వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపెట మండలం గండుగుల పల్లిలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఎంపీ నామ నాగేశ్వర్ రావు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమావేశం కావడం మరో చర్చ కు తెరలేపింది. స్థానిక పరిణామాల నేపథ్యంలో అధిష్టానం ఆదేశాల మేరకు తుమ్మలతో భేటీ అయ్యారా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పెద్ద  ఎత్తున ప్రచారం నడుస్తోంది. రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో అసలు  ఖమ్మం టీఆర్‌ఎస్‌లో  ఏం జరుగుతుందన్న సస్పెన్స్ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమంటూ ఆ మధ్య తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. పాలేరు నియోజకవర్గం నుంచి తుమ్మలపై పోటీ చేసి గెలిచిన కందాల ఉపేందర్‌ రెడ్డికి తాను అండగా ఉంటానంటూ మంత్రి అజయ్‌ చేసిన వ్యాఖ్యలు సైతం చర్చనీయాంశంగా మారాయి. ఖమ్మం టీఆర్ఎస్ లో నెలకొన్న తాజా పరిణామాలతో కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీకి ఇబ్బందులు తప్పవనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు పొంగులేటి వ్యాఖ్యలపై హైకమాండ్ సీరియస్ గా స్పందించే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: