కరోనా టీకా కోసం ప్రపంచం దాదాపు ఏడాదిగా ఎదురు చూసింది. మొత్తానికి ఈ నెలలోనే కరోనాటీకా అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఇండియా, రష్యా వంటి దేశాల్లో కరోనా టీకా పంపిణీ ప్రారంభమైంది కూడా. ఇది ప్రపంచానికి శుభవార్తే కానీ.. దారుణమైన విషయం ఏంటంటే.. ఈ కరోనా టీకాల పంపిణీలో కూడా వివక్ష ఎదురవుతోందట. అదేం వివక్ష అంటే ధనిక- పేద వివక్ష.. అవును నిజం.. ఈ విషయం సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థే తెలిపింది.

టీకా పంపిణీలో అసమానతలపై ప్రపంచ ఆరోగ్యసంస్థ ఈ వివరాలు వెల్లడిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. ఒక పేద దేశానికి 25 డోసులు మాత్రమే అందాయని.. అదే సమయంలో 50 ధనిక దేశాల్లో 3.9 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వారం పాటు కొనసాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సమావేశం ప్రారంభమైంది. దీన్ని ప్రారంభించిన సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్  కరోనా టీకా డోసుల పంపిణీలో అసమానతలపై ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక పేద దేశానికి ఇప్పటికి 25 డోసులు మాత్రమే లభించాయని చెప్పారు. టీకా అందుబాటులోకి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆయన..ఈ అసమానతలు మంచిది కాదన్నారు. అంతే కాదు..  కరోనా టీకాను వృద్ధుల కంటే ముందు యువతకు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. ధనిక దేశాల్లో ఆరోగ్యంగా ఉన్న యువతకు సైతం టీకాలు అందుతున్నాయని.. పేద దేశాల్లోని వృద్ధులకు టీకాలు అందడం లేదని తెలిపారు. ఇది మానవాళికి సరైనది కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కామెంట్ చేసింది.

ఇక ఇండియా విషయానికి వస్తే.. ధనిక పేద తేడా లేకుండా టీకాలను పంపిణీ చేస్తోంది. టీకాల పంపిణీలో మన ఇండియా ప్రపంచ రికార్డు సృష్టించింది.. ప్రపంచానికి తన సత్తా ఏంటో తెలియజెప్పింది. ఇండియా ఒక్క రోజులోనే అత్యధిక టీకాలు వేసిన రికార్డును సొంతం చేసుకుంది. భారత్‌లో తొలి రోజు 2,07,229 మందికి కరోనా టీకాలు ఇచ్చామని కేంద్రం ప్రకటించింది. ఒక రోజు వ్యాక్సినేషన్‌లో భారత్‌దే మొదటి స్థానం. అంతే కాదు.. మరో 7 దేశాలకు కూడా కరోనా టీకా ఉచితంగా పంపిణీ చేస్తామని భారత్ ప్రకటించింది. జయహో భారత్.

మరింత సమాచారం తెలుసుకోండి: