"అవునండీ, మా సీఎం కేసీఆర్ కరోనా టీకా కార్యక్రమం ప్రారంభోత్సవానికి రాలేదు, అయితే ఏంటి.. మా దగ్గర 99శాతం కార్యక్రమాలు మంత్రి కేటీఆర్ చూస్తారు అందులో తప్పేముంది" అంటూ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా కేసీఆర్ సైడ్ అవుతున్నారనే వార్తలకు ఆయన బలం చేకూర్చారు. అంతే కాదు ముఖ్యమంత్రి మార్పు వ్యవహారంపై కూడా ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు ఉంటే ఉండవచ్చని, అందుకు రకరకాల కారణాలు కూడా ఉండొచ్చని అన్నారు మంత్రి ఈటల రాజేందర్. సీఎం మార్పు ప్రచారంపై ఈటల తనదైన శైలిలో స్పందించారు. "ఉంటే ఉండవచ్చు! తప్పకుండా! ఉంటే ఉంటుందండీ!! తప్పేముంది?" అని వ్యాఖ్యానించారు.

కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమమే కాదు.. సీఎం అందుబాటులో లేని అనేక సందర్భాల్లో ఆ పాత్రను కేటీఆర్‌ పోషిస్తున్నారని అన్నారు ఈటల రాజేందర్. తనకు, సీఎం కేసీఆర్ కు మధ్య గ్యాప్ ఉందని వస్తున్న వార్తల్ని కూడా ఆయన కొట్టిపారేశారు. తాను రాజకీయంగా సైలెంటయ్యాననే వార్తలను కూడా మంత్రి తోసిపుచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొంతెత్తి మాట్లాడామని, ప్రజలవైపు నిలబడ్డామని, ఇప్పుడొక మంత్రిగా మాటలు తక్కువ, చేతలు ఎక్కువ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

పార్టీ ఎవరు పెట్టినా, జెండా ఎవరు తెచ్చినా, సమష్టిగా పనిచేస్తేనే పార్టీ నిలుస్తుందని చెప్పారు ఈటల. టీఆర్‌ఎస్ లోని ప్రతి వ్యక్తీ నా పార్టీ, నా జెండా అని గుండెల్లో పెట్టుకోకపోతే పార్టీ బాగుండదని స్పష్టం చేశారు. పార్టీలు, నేతలు.. చరిత్ర నిర్మాతలు కాదని, ప్రజలే చరిత్ర నిర్మాతలని అన్నారు ఈటల. తెలంగాణ ఆవిర్భావం ముందు నుంచీ ఎన్నో ఘన విజయాలు సాధించి, సంస్థాగత బలం ఎక్కువగా ఉన్న టీఆర్ఎస్ ను దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత ఊడ్చేస్తాం.. తుడిచేస్తాం అనే భ్రమల్లో చాలామంది ఉన్నారని, వారివన్నీ పగటి కలలేనని కొట్టిపారేశారు ఈటల. 

మరింత సమాచారం తెలుసుకోండి: