ఎలిమెంటరీ స్కూల్స్ ప్రారంభంపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గిందని అనుకుంటున్న సమయంలో.. ఫిబ్రవరి 1నుంచి క్లాసులు మొదలు పెట్టే అంశంపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ విషయంపై అధికారులతో చర్చించిన ఆయన.. ప్రాథమిక పాఠశాలల గురించి కూడా ఆలోచించాలని సూచించారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి 1నుంచి 5 తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించే అవకాశాన్ని పరిశీలించాలని, వీలైతే గతంలోలాగా అన్ని పీరియడ్స్ జరిపేలా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

విద్యా కానుక టెండర్ల ప్రక్రియను వెంటనే పూర్తి చేసి, బడులు తెరిచే నాటికి విద్యార్థులకు విద్యా కానుక అందించాలని ఆదేశించారు సీఎం జగన్. వచ్చే విద్యా సంవత్సరంలో ఏడో తరగతి వారికి ఇంగ్లిష్ మీడియం బోధనపై దృష్టి పెట్టాలని కూడా సూచించారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ, విద్యార్థుల హాజరు కోసం రూపొందించిన మొబైల్‌ యాప్‌ లపై సీఎం జగన్‌ అధికారులతో సమీక్షించారు. అమ్మఒడి డబ్బుల్లో ప్రతి ఒక్కరినుంచి వెయ్యి రూపాయలు మినహాయించుకుని మరుగుదొడ్ల నిర్వహణ నిధికి జమ చేస్తున్నారు. ‘మరుగుదొడ్ల నిర్వహణ నిధిపై రాష్ట్ర, జిల్లా, పాఠశాల, కళాశాల స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేయాలి. ఇది అత్యంత ప్రాధాన్యత ఉన్న అంశం. నాడు-నేడు పనుల ద్వారా మరుగుదొడ్లను నిర్మించాం. ఇంకా ఎక్కడైనా మరమ్మతులు అవసరమైతే వెంటనే చేయాలి. మరుగుదొడ్ల నిర్వహణలో సులభ్‌ వంటి సంస్థల అనుభవాన్ని, నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలి’ అని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు.

విద్యార్థులు స్కూల్ కి హాజరు కాకపోతే.. తల్లిదండ్రుల ఫోన్లకు వెంటనే మెసేజ్ వెళ్లే యాప్ ని అధికారులు ఈ సందర్భంగా సీఎం కు చూపించారు. దీని పనితీరు పరిశీలించాలని ప్రయోగాత్మకంగా వెంటనే దీన్ని అమలు చేయాలని అధికారులకు సూచించారు జగన్. ‘విద్యార్థులు పాఠశాలలకు రాకపోతే తల్లిదండ్రులకు మెసేజ్ వెంటనే వెళ్లాలి. వాలంటీర్‌తో వారి యోగక్షేమాలు తెలుసుకోవాలి. సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్ లు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలి. యాప్‌ లో హాజరు వివరాలను తల్లిదండ్రులు పరిశీలించుకునే అవకాశం కల్పించాలి’ అని సీఎం ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: