సీఎం జగన్ ఢిల్లీ టూర్ పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత నెల 15న ఢిల్లీ వెళ్లొచ్చిన జగన్, అతి తక్కువ గ్యాప్ లో మరోసారి హస్తిన పర్యటనకు సిద్ధం కావడం, అందులోనూ మరోసారి అమిత్ షా తోనే ఆయన భేటీ కాబోతుండటంపై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రాజధానుల తరలింపు విషయంపై సీఎం.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో చర్చిస్తారని కొంతమంది అంటుండగా.. ఆలయాల ఘటనలపై సీఎం కు క్లాస్ పీకేందుకే ఆయనను ఢిల్లీ పిలిపించారని మరికొందరి ఊహ.

రాజధానుల తరలింపు కీలకం..
గతంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం జగన్.. న్యాయ రాజధానిగా కర్నూలు ఏర్పాటుకి సహకరించాలని హోం మంత్రి అమిత్ షా ని కోరారు. హైకోర్టు తరలింపు, తదితర వ్యవహారాలపై అనుమతులు త్వరితగతిన ఇప్పించాలని, అభివృద్ది వికేంద్రీకరణకు సహకరించాలని అడిగారు. ఇప్పుడుకూడా అదే అంశాన్ని గుర్తు చేయడంతోపాటు.. విశాఖకు పరిపాలనా సంస్థల తరలింపు సజావుగా సాగేలా చూడాలని కోరబోతున్నట్టు తెలుస్తోంది. పాలనా రాజధానిగా విశాఖ అతి త్వరలో మారుతుందని వైసీపీలోని కీలక నేతలు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. వీలైనంత త్వరగా మూడు రాజధానుల అంశాన్ని తేల్చేయాలని, వచ్చే ఎన్నికల నాటికి అభివృద్ధి వికేంద్రీకరణ ఫలితాలు ప్రజలకు అందేలా చూడాలనేది జగన్ ఆలోచన. అందుకే ఆయన రాజధానుల తరలింపుపై తొందర పడుతున్నారని, పదే పదే ఢిల్లీకి వెళ్తున్నారని సమాచారం.

ఆలయాల ఘటనపై అక్షింతలు వేస్తారా..?
ఇటీవల రాష్ట్రంలో వరుసగా ఆలయాలలో పలు అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాలు.. ఈ ఘటనలకు మీరంటే మీరు బాధ్యులంటూ దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. పోలీసుల విచారణలో రాజకీయ కోణం కూడా ఉండటంతో కావాల్సినంత మసాలా చేకూరింది. అటు టీడీపీ, బీజేపీకి చెందిన కొంతమంది కార్యకర్తలపై కూడా కేసులు నమోదు కావడం మరింత సంచలనంగా మారింది. దీనిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పుడిదే విషయం హోం మంత్రి అమిత్ షా తో జరిగే చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశముందని అంటున్నారు నేతలు. ప్రస్తుతానికి జగన్ - అమిత్ షా భేటీ అజెండా అధికారికంగా బయటకు రాలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: