కిడ్నాప్ కేసులో జైలులో ఉన్న మాజీ మంత్రి అఖిల ప్రియకు షాక్ మీద షాక్ తగులుతోంది. బెయిలు పిటిషన్ ఇప్పటికే పలుమార్లు తిరస్కరణకు గురికావడం ఓవైపు.. సొంత ఇలాకాలో భూమా ఫ్యామిలీకి చెక్ పెట్టేలా ప్రత్యర్థులు వ్యూహర రచన చేయడం మరోవైపు.. ఆమెను ఇబ్బంది పెడుతున్నాయి. పాతికేళ్లుగా భూమా కుటుంబానికే ఉన్న విజయ డైరీ చైర్మన్ పోస్ట్ ఇప్పుడు ప్రత్యర్థుల చేతుల్లోకి వెళ్లిపోతోంది.

భూమా నాగిరెడ్డి దంపతుల మరణంతో రాజకీయాల్లో ఆ కుటుంబం హవా తగ్గుతుందని అనుకున్నారంతా. కానీ.. అఖిల ప్రియ మంత్రిగా మారి కుటుంబం పేరు నిలబెట్టింది. కానీ టీడీపీ ఓటమి తర్వాత భూమా కుటుంబానికి మరోసారి గడ్డుకాలం ఎదురైంది. అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్.. వ్యవహార శైలి కూడా చాలామందిని దూరం చేసింది. తీరా ఇప్పుడు కిడ్నాప్ కేసులో ఇరుక్కోవడం, అఖిల ప్రియ జైలులో ఉండటం, ఆమె భర్త భార్గవ్ రామ్ పరారీలో ఉండటం, ఆమె తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి అడ్రస్ లేకపోవడం.. భూమా కుటుంబానికి పెద్ద ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో భూమా వైరి వర్గాలు కర్నూలు జిల్లాలో బలపడటానికి ప్రయత్నాలు మొదలు పెట్టాయి.

25ఏళ్లుగా భూమా నాగిరెడ్డి సోదరుడు నారాయణ రెడ్డి విజయ డైరీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. మరో దఫా ఎన్నికలకు నామినేషన్లు మొదలయ్యాయి. ఈ టైమ్ లో భూమా కుటుంబం పాతికేళ్ల ఏక ఛత్రాధిపత్యానికి గండి కొడుతూ.. ఎస్వీ జగన్మోహన్ రెడ్డి తెరపైకి వచ్చారు. శోభానాగిరెడ్డి తమ్ముడైన జగన్మోహన్ రెడ్డి.. ఈ సారి విజయ డైరీ చైర్మన్ గా ఎంపిక అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైసీపీ అండదండలతో ఆయన విజయం నల్లేరుపై నడక అని అంటున్నారు. అదే జరిగితే భూమా ఫ్యామిలికీ అది మరో పెద్ద ఎదురు దెబ్బ అవుతుంది. అఖిల ప్రియ జైలులో ఉన్న టైమ్ లో ఇక్కడ ఈ వ్యవహారాలన్నీ జరుగుతున్నాయి. అటు టీడీపీ కూడా భూమా కుటుంబాన్ని పట్టించుకోవడంలేదు. ఇటు రాజకీయ అండలేకపోవడం, అటు స్థానికంగా పెత్తనం కోల్పోవడంతో భూమా కుటుంబం రాజకీయాలకు తెరపడుతుందని భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: