దివంగ‌త సీనియ‌ర్ నేత భూమా నాగిరెడ్డి ఫ్యామిలీ ఇప్ప‌టికే అనేక క‌ష్టాల్లో ఉంది. భూమా కుమార్తె, మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ ఇప్ప‌టికే జైలులో ఉండ‌గా.. ఆమె భ‌ర్త భార్గ‌వ్ రామ్ ప‌రారీలో ఉన్నారు. భార్గ‌వ్ మ‌హారాష్ట్ర‌లో త‌ల‌దాచుకున్న‌ట్టు చెపుతున్నారు. ఇక అఖిల త‌మ్ముడు జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి కనిపించడం లేదు. చెల్లి మౌనికారెడ్డి ఆళ్లగడ్డ టు హైదరాబాద్‌ తిరుగుతున్నారు. ఈ టైంలోనే వాళ్ల కుటుంబానికి మ‌రో షాక్ త‌గిలింది. గ‌త 25 ఏళ్లుగా వాళ్లు విజ‌య డెయిరీ చైర్మ‌న్ ప‌ద‌విని కాపాడుకుంటూ వ‌స్తున్నారు. ఎన్ని పార్టీలు మారినా కూడా ఈ ప‌ద‌వి మాత్రం వాళ్ల వ‌ర్గం చేతుల్లోనే ఉంటూ వ‌స్తోంది. అస‌లు ఈ ప‌ద‌వికి ఎప్పుడూ పోటీయే ఉండ‌డం లేదు.

భూమా నాగిరెడ్డి చిన్నాన్న భూమా నారాయణరెడ్డి గెలుస్తున్నారు. ఆయన ఆధిపత్యమే డెయిరీలో నడుస్తోంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అయితే ఇప్పుడు భూమా ఫ్యామిలీ అంతా చెల్లా చెదురు అయిపోయింది. ఆ ఫ్యామిలీలో చాలా త‌క్కువ మంది మాత్ర‌మే టీడీపీలో ఉండ‌గా.. చాలా మంది వైసీపీలో ఉన్నారు.. కొంద‌రు బీజేపీలోకి కూడా వెళ్లారు. ఈ ప‌రిస్థితుల్లో విజ‌యా డెయిరీ ఎన్నిక‌ల్లో వాళ్లు ఓడిపోవ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. ఈ సారి ఈ ప‌ద‌విని  అఖిలప్రియ మేనమామ, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ. మోహ‌న్ రెడ్డి కావాల‌ని ప‌ట్టు బ‌డుతున్నారు.

ఇటీవ‌ల క‌ర్నూలు జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన సీఎం జ‌గ‌న్‌కు సైతం ఈ విష‌యాన్ని జిల్లా ఎమ్మెల్యేలు సూచించారు. దీంతో జ‌గ‌న్ సైతం మోహ‌న్ రెడ్డికే ఈ ప‌ద‌వి ఇద్దామ‌ని అన్నట్టు తెలుస్తోంది. మోహ‌న్ రెడ్డి గ‌తంలో వైసీపీ నుంచే ఎమ్మెల్యేగా గెలిచి.. ఆ త‌ర్వాత టీడీపీలోకి జంప్ చేసినా గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు సీటు ఇవ్వ‌లేదు. దీంతో ఎన్నికల వేళ ఆయ‌న తిరిగి వైసీపీలోకి రివ‌ర్స్ జంప్ చేసినా ఇక్క‌డ కూడా సీటు ఇవ్వ‌లేదు. ప్ర‌స్తుతం క‌ర్నూలు న‌గ‌ర రాజ‌కీయాల్లో ఎమ్మెల్యే హ‌పీజ్ ఖాన్‌కు, మోహ‌న్ రెడ్డికి మ‌ధ్య పొస‌గ‌డం లేదు.

ఈ ప‌రిస్థితుల్లో ఆయ‌న‌కు ఈ ప‌ద‌వి క‌ట్ట‌బెడితే కాస్త శాంత‌ప‌రిచిన‌ట్టు ఉంటుంద‌ని జ‌గ‌న్ కూడా భావిస్తున్నార‌ట‌. ఇక రు. 140 కోట్ల టర్నోవర్ ఉన్న విజయ డెయిరీ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు అటు భూమా ఇటు ఎస్వీ కుటుంబాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నంద్యాల రాజకీయం ఆసక్తిగా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: