కాళేశ్వ‌రం ప్రాజెక్టు సంద‌ర్శ‌న‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంగ‌ళ‌వారం వెళ్ల‌నున్నారు. యాసంగి సీజన్‌లో పంటల సాగు మొద‌లు కావ‌డంతో తెలంగాణ‌లోని ప‌లు జ‌లాశ‌యాల‌కు కాళేశ్వ‌రం నుంచి నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాట్లు చ‌క‌చ‌క జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే రెండు మోటార్ల‌ను ఆన్ చేశారు. అయితే ఎత్తిపోత‌ల ప‌నితీరుతో పాటు మిగిలిన ప్రాజెక్టు ప‌నుల అంశాల‌పై అధికారుల‌తో ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మీక్షించ‌నున్నారు.  ప్రస్తుతం ప్రాజెక్టులో అందుబాటులో ఉన్న జలాలు ఎన్ని? ఎగువ నుంచి ఎంత నీరు వస్తున్నది? రోజుకు ఎన్ని టీఎంసీల నీటిని పంపింగ్‌ చేయవచ్చు? వేసవికాలంలో కూడా రిజర్వాయర్లలో పూర్తిస్థాయిలో నీరు ఉండేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? పంటలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీటిని అందించడానికి తీసుకోవాల్సిన చర్యలేంటి అనే త‌దిత‌ర అంశాల‌పై అధికారులతో సమీక్ష చేస్తారు. లక్ష్మీ బరాజ్‌ను సందర్శించి పరిస్థితిని అంచనావేస్తారు.


కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు సీఎం కేసీఆర్.. ఉదయం 11గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో కాళేశ్వరానికి చేరుకుంటారు. 11 గంటల నుంచి 11.45 నిమిషాల వరకు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి క్షేత్రంలో పూజలు నిర్వహించనున్నారు. 11.55 నిమిషాలకు మెడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌ను సందర్శిస్తారు. అక్కడే మధ్యాహ్న భోజనం అనంతరం ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు. నాలుగు గంటలపాటు సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. బరాజ్‌ వద్ద భోజనం చేసిన అనంతరం హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరిగివస్తారు.కేసీఆర్ పర్యటన నేపథ్యంలో కాళేశ్వరం ఆలయం, లక్ష్మీబరాజ్‌ దగ్గర అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. లక్ష్మీబరాజ్‌ వద్ద సుమారు 500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.


మరోవైపు ఏపీ సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి ఢిల్లీ బయల్దేరనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో జగన్‌ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇతర కేంద్ర మంత్రులతో కూడా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఏపీలో తాజాగా నెలకొన్న పరిణామాలపై సీఎం జగన్‌…హోంశాఖ మంత్రి అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌తోనూ భేటీ అవుతారని తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: