ఇందిరాగాంధీ ని ఈ దేశం ఎప్పటికీ మరచిపోదు, ఇండియా అంటే ఇందిర అన్న నినాదం కూడా గుర్తుకువస్తుంది. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తనయగా ఇందిరాగాంధీ రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ తరువాత నెహ్రూ ప్రధాని అయితే ఆయన రాజకీయ కార్యదర్శిగా కూడా ఆమె పని చేశారు. ఈ నేపధ్యంలో తండ్రి నుంచి అన్ని రకాలైన రాజకీయ మెలకువలను నేర్చుకున్న ఇందిరా గాంధీ అంతకు మించి అన్నట్లుగా దూసుకుపోయారు.

ఇందిరాగాంధీ 1964లో నెహ్రూ మరణించాక లాల్ బహుదూర్ శాస్త్రి ప్రభుత్వంలో సమాచార మంత్రిగా పనిచేశారు. 1966లో శాస్త్రి మరణంతో ఇందిరా తొలిసారిగా ఇదే రోజు అంటే 1966  జనవరి 19న తొలి సారిగా ఈ దేశానికి ప్రధాని అయ్యారు. అప్పటికి ఆమెను వ్యతిరేకించే ఉద్ధండులు అయిన రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ నిండా ఉన్నారు. అయినా సరే ఆమె వారిని దాటుకుని మరీ ముందుకు వచ్చారు. ఆమె ప్రధాని కావడం ద్వారా ఒక మహిళ ఈ దేశానికి సారధ్యం వహించే అవకాశం తొలిసారిగా ఏర్పడింది.

అది అప్పటికీ ఇప్పటికీ ఒక రికార్డుగా ఉంది. ఇదిలా ఉంటే  ఇందిరా గాంధీ ప్రధాని అయ్యనాటికి ఆమె వయసు 45 ఏళ్ళు మాత్రమే. ఆమె యువ మహిళా నేతగా దూసుకురావడమే కాదు, ఈ దేశానికి ఒక దశ, దిశ చూపించారు. ఇందిరాగాంధీ ఆ మీదట మరో రెండు సార్లు ప్రధాని అయ్యారు. ఆ విధంగా ఇందిరా గాంధీ తమ మొత్తం కెరీర్ లో 16 ఏళ్ళకు పైగా ప్రధాని హోదాలో ఈ దేశానికి సేవలు అందించారు. ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలను కూడా ఆమె తీసుకున్నారు. ఆమె తరువాత పురుషాధిక్యత మళ్లీ రాజ్యమేలింది. నాటి నుంచి మళ్ళీ ప్రధాని గా మహిళ ఎవరూ  ముందుకు రాని స్థితి ఉంది. మరి సమీప భవిష్యత్తులో ప్రియాంక గాంధీ తన నాన్నమ్మ రికార్డుని బద్ధలు కొడతారా అన్న చర్చ అయితే ఉంది. చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: