తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు అత్యంత కీలకంగా  మారిన  నాగార్జున సాగర్ ఉప ఎన్నికను సీఎం కేసీఆర్ సవాల్ గా తీసుకున్నారని తెలుస్తోంది. సాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో ఆయనే స్వయంగా రంగంలోకి దిగబోతున్నారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఏ లోక్ సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలోనూ ఆయన ప్రచారం చేయలేదు. వరంగల్ లోక్ సభ, పాలేరు, నారాయణ ఖేడ్, హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉన్నారు కేసీఆర్. కాని ఇప్పుడు నాగార్జున సాగర్ లో గెలవడం కంపల్సరి కావడంతో కేసీఆరే ప్రచారం చేయబోతున్నారని చెబుతున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 22-24 తేదీల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విషయమై పార్టీ మంగళవారం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

           నాగార్జున సాగర్ లో నిర్వహించే సీఎం కేసీఆర్ సభకు లక్షన్నర మందిని సమీకరించాలని టీఆర్ఎస్ నిర్ణయించిందని తెలుస్తోంది. ఈ మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి సోమవారం కేటీఆర్‌ను కలిసి సభ విషయమై చ ర్చించారు. అలాగే శనివారం ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలతో కేటీఆర్ నిర్వహించిన సమావేశంలోనూ సభ, జన సమీకరణ అంశాలను చర్చించినట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి జనాన్ని భారీగా తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారట. ఈ సమావేశంలోనే నాగార్జున సాగర్ నియోజకవర్గానికి కేసీఆర్ కొన్ని వరాలు ప్రకటించడంతో పాటు గతంలో ప్రకటించిన పథకాలను ప్రారంభిస్తారని తెలుస్తోంది.

   నాగార్జున సాగర్ కేసీఆర్  సభ ఏర్పాట్లు, పర్యవేక్షణ బాధ్యతను ప్రభుత్వ మాజీ విప్ కర్నె ప్రభాకర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, సోమ భరత్‌కుమార్ గుప్తా తదితరుల నేతృత్వంలోని కమిటీకి అప్పగించినట్టు సమాచారం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ నాగార్జున సాగర్ కు ఇంచార్జ్ గా వ్యవహరించారు కర్నె ప్రభాకర్. అనారోగ్యంతో నోముల నర్సింహయ్య ప్రసంగాలు చేయకపోవడంతో.. అంతా తానే వ్యవహరించి జానారెడ్డిని మట్టికరిపించారు కర్నె. అందుకే ఈ సారి కూడా ఆయనకే సాగర్ ప్రచార బాధ్యతలు  అప్పగించబోతున్నారని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: