తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సందర్శనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన పేరిట ప్రజలను మరోసారి మోసం చేశారని ఆరోపించారు. గత రెండేళ్లుగా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని ఆరోపించారు. కేసీఆర్  ఇప్పటికైనా డ్రామాలు ఆపాలన్నారు సంజయ్. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేరన్నారు. కాళేశ్వరంలో పూజలు చేస్తే పాపాలు పోవన్నారు సంజయ్. కేసీఆర్ పర్యటనను ఎవరూ పట్టించుకోలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ ఫెయిలయ్యిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్‌లో దర్శనీయ స్థలం అవుతుందేతప్ప, ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడదన్నారు బండి సంజయ్.

       కేంద్రానికి ఇచ్చిన డీపీఆర్‌లో 17.50లక్షల ఎకరాలనే వివరించారని, కానీ రాష్ట్ర ప్రజలకు మాత్రం కోటి ఎకరాలకు నీరు అంటూ వంచిస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టుకు లక్ష కోట్లు ఖర్చు పెట్టి.. ఇప్పుడు మూడో టీఎంసీ అంటూ ముచ్చట చెబుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర జలవనరులశాఖ డీపీఆర్ ఇవ్వమంటే ఇప్పటివరకు ఇవ్వలేదని, అది ఇస్తే కేసీఆర్ బండారమంతా బయటపడుతుందన్నారు.కాళేశ్వరం డీపీఆర్ కేంద్రం ముందు పెట్టాలని, ఈ విషయంలో ఎక్కడైనా చర్చకు మేం సిద్ధమని బండి సజయ్ సవాల్ విసిరారు.

          మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం కేసీఆర్.. నిర్మాణం అనుకున్న సమయంలో అనుకున్న విధంగా పూర్తయి నీటి పంపింగ్ కూడ నిరాటంకంగా జరుగుతుండడంపట్ల సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారు.   ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి కావడంలో కృషి చేసిన నీటి పారుదల శాఖాదికారులు, వర్కింగ్ ఏజెన్సీలు, ఇతర శాఖల ఉద్యోగులను ముఖ్యమంత్రి అభినందించారు. ప్రస్తుతం బ్యారేజీల వద్ద పూర్తి స్థాయిలో నీరు నిలువ ఉందని, ఈ ఎండాకాలం అంతా ఈ నీటితో  రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువులు, నింపాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల వారీగా ఆపరేషన్ రూల్స్  రూపొందించి అమలు చేయాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: