ఏపీ మంత్రి కొడాలి నాని, మాజీ మంత్రి దేవినేని ఉమాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ఎప్పటినుంచో వీరిద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మంత్రి కొడాలి నాని, చంద్రబాబు-దేవినేని ఉమాలపై తీవ్ర విమర్శలు చేశారు. పరుషపదజాలంతో కొడాలి నాని విరుచుకుపడ్డారు. తనను భ్రష్టు పట్టించటానికి పేకాట ఆడిస్తున్నారని విమర్శలు చేస్తున్నారని, నోరు అదుపులో పెట్టుకోకపోతే ఇంటికి వచ్చి ఉమాకి బడిత పూజ చేస్తానని హెచ్చరించారు.

ఇక కొడాలి ఇలా తీవ్రంగా మాట్లాడటంతో, ఉమా కూడా అంతే గట్టిగా స్పందించారు. కొడాలిని తిడుతూ, గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం దగ్గర దీక్ష చేస్తానని, దమ్ముంటే తనని టచ్ చేయాలని ఉమా సవాల్ విసిరారు. ఇక ఉమా సవాల్ విసిరి, మంగళవారం గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం దగ్గరకు వచ్చి దీక్ష చేయడానికి కూర్చోబోతుంటే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక దీనిపై కొడాలి, వల్లభనేని వంశీలు తీవ్రంగా స్పందించారు. జనానికి ఇబ్బంది కలిగించేలా కాకుండా ఉమా చెబితే ఎక్కడైకైనా వచ్చి చర్చిస్తామని అన్నారు. అలాగే ఉమాని కొట్టకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కొడాలి ఛాలెంజ్ చేశారు.

అయితే ఉమా, కొడాలి-వంశీల మధ్య విభేదాలు టీడీపీలో ఉన్నప్పటి నుంచి ఉన్నాయి. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ప్రచారంలో ఎన్టీఆర్‌కు యాక్సిడెంట్ జరగడటం, ఆ తర్వాత టీడీపీ ఓడిపోవడం, చంద్రబాబు, జూనియర్‌ని దూరం పెట్టడం జరిగాయి. ఎప్పుడైతే జూనియర్ పార్టీకి దూరమయ్యారో అప్పటి నుంచి, ఆయనని అభిమానించే కొడాలిని సైతం దేవినేని ఉమా రాజకీయంగా ఎదగనివ్వకుండా తోక్కేసే ప్రయత్నం చేశారు.

దీంతో కొడాలి టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చేశారు. ఇక ఉమా వల్ల వంశీ కూడా ఇబ్బందులు పడ్డారు. అందుకే వంశీ కూడా వైసీపీ వైపు వచ్చేశారు. ఇక ఇప్పుడు కొడాలి-వంశీలు కలిసి ఉమాని ఓ ఆట ఆడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: