గత ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి పాలయ్యాక, చాలామంది నాయకులు సైడ్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఏపీలో టీడీపీ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఈ క్రమంలోనే చంద్రబాబు పార్టీని గాడిలో పెట్టడానికి కీలక పదవులు భర్తీ చేశారు. కొత్తగా పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని, మహిళా అధ్యక్షులని నియమించారు.

ఇక కీలకమైన ఏపీ టీడీపీ అధ్యక్షుడు పదవిని కింజరాపు అచ్చెన్నాయుడుకు ఇచ్చారు. అప్పటివరకు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన కళా వెంకట్రావుని సైడ్ చేసేశారు. ఇక కళా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు టీడీపీలో పెద్ద ఊపు లేదు. కానీ ఎప్పుడైతే అచ్చెన్నాయుడు రంగంలోకి దిగారో అప్పటి నుంచి, టీడీపీలో కొత్త ఉత్సాహం వచ్చింది. అచ్చెన్నాయుడు నిత్యం జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వంలోని తప్పులని ఎత్తిచూపిస్తున్నారు.

అలాగే సొంత పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడుతున్నారు. ఇలా అచ్చెన్న అధ్యక్ష బాధ్యతలకు సరైన న్యాయం చేసే దిశగానే పనిచేస్తున్నారు. అయితే అచ్చెన్న అధ్యక్షుడు అయ్యాక కఠిన పరీక్షలు ఏమి ఎదురుకాలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రెండు-మూడు నెలల వరకు జరిగేలా కనిపించడం లేదు. కానీ తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక రూపంలో అచ్చెన్నకు తొలిపరీక్ష ఎదురుకానుంది. త్వరలో తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉపఎన్నికలో గెలవడానికి టీడీపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అందరికంటే ముందుగానే పనబాక లక్ష్మీని తిరుపతి బరిలో నిలిపారు. ఇక తిరుపతి ఉపఎన్నిక విషయంలో చంద్రబాబు ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులకు సూచనలు ఇస్తూనే ఉన్నారు. ఇటు అచ్చెన్న కూడా తిరుపతిలో టీడీపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు.

అయితే అధికారంలో ఉన్న వైసీపీకి గెలవడం సులువే. పైగా తిరుపతిలో టీడీపీకి పెద్దగా గెలిచిన రికార్డు లేదు. దీని బట్టి చూసుకుంటే అచ్చెన్నకు టీడీపీని గెలిపించడం కష్టమే. కానీ వైసీపీకి గట్టి పోటీ ఇస్తే మాత్రం టీడీపీకి ప్లస్ అవుతుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. అందుకే అచ్చెన్న ఇప్పటినుంచే తిరుపతిలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు. అలాగే బహిరంగ సభ కూడా పెట్టనున్నారు. మరి చూడాలి తిరుపతి పరీక్షలో అచ్చెన్న ఎంతవరకు సక్సెస్ అవుతారో.

మరింత సమాచారం తెలుసుకోండి: