తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయ యుద్ధం సాగుతోంది. ఇరు పార్టీల నేతలు పరస్పర సవాళ్లు విసురుకుంటున్నారు.  వ్యక్తిగత దూషణలకు దిగుతూ  రాజకీయ సెగ  పుట్టిస్తున్నారు.  తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్ తో పాటు ఇతర కమలం నేతలు సీఎం కేసీఆర్ టార్గెట్ గా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అటు గులాబీ నేతలు కూడా కమలనాధులకు కౌంటర్లు ఇస్తున్నారు. రెండు పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్న ఇలాంటి నేపథ్యంలో  రామ భక్తులు నిర్వహించిన కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పాల్గొని అందరికి షాకిచ్చారు. హిందు సంఘాలు, రామ భక్తులు నిర్వహించిన ర్యాలీలో పాల్గొనడంతో పాటు తాను కూడా అయోధ్యలో రామాలయ నిర్మాణానికి విరాళాలు సేకరించారు.
           
  అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా జరుగుతోన్న విరాళాల సేకరణలో భాగంగా ఆందోల్ - జోగిపేటలో కూడా రామ మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు.  విరాళాల సేకరణ కోసం రామ భక్తులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే ఎవరూ ఊహంచిని విధంగా టీఆర్ఎస్‌కు స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కూడా ఈ ర్యాలీలో తన అనుచరులతో కలిసి పాల్గొన్నారు. హిందూ భక్తులతో కలిసి ఆయన బైక్ ర్యాలీ నిర్వహించారు. తర్వాత పట్టణంలో ఇంటింటికి తిరిగి విరాళాలు సేకరించారు. అంతేకాదు రామ మందిరం నిర్మాణానికి తన వంతుగా 11,111 రూపాయల విరాళం అందజేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్.

 రామమందిర నిర్మాణం కోసం విరాళాలు సేకరించే కార్యక్రమంలో ఎమ్మెల్యే క్రాంతి పాల్గొనడం ఆసక్తిరేపుతోంది. రామమందిర నిర్మాణం కోసం విరాళాలు సేకరించే కార్యక్రమంలో  టీఆర్ఎస్ ఎమ్మెల్యే పాల్గొనడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనను  ప్రజలు ఆసక్తిగా గమనించారు. అయితే రాముడు అందరి వాడు అన్న సంకేతం ఇచ్చేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈ ర్యాలీలో పాల్గొన్నారని చెబుతున్నారు. ఎన్నికల సమయంలోనూ క్రాంతి కిరణ్ తన ప్రసంగాల్లో  ఇవే వ్యాఖ్యలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: