భారత్ మరియు చైనా దేశాల సరిహద్దు రాష్ట్రాల్లో ఒకటైన అరుణాచల్‌ ప్రదేశ్‌లో మన దాయాది దేశం డ్రాగన్ చైనా ఏకంగా ఒక గ్రామాన్నే నిర్మించిందన్న వార్తలపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, యువ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ప్రధాని మోదీ తాను చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసుకోవాలని వ్యాఖ్యానించారు. మోదీ పేరును సూటిగా ప్రస్తావించకుండానే... ‘మన దేశాన్ని ఎవరి ముందు తలవంచనీయమని చెప్పారు. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తుచేసుకోండి' అని రాహుల్ ట్వీట్ చేశారు. భారత భూభాగంలో చైనా నిర్మించిన గ్రామానికి చెందిన స్క్రీన్‌షాట్‌ను కూడా తన ట్వీట్‌కు రాహుల్ జోడించటం విశేషం.
 
 
 ఇప్పుడు రాహుల్ గాంధీ విమర్శలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. మెక్‌మోహన్ రేఖ వెంబడి భారత భూభాగంలో చైనా గ్రామం నిర్మించడం కొత్త పరిణామమేమీ కాదని పేర్కొంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాహుల్‌ను టార్గెట్ చేస్తూ.. ‘నెలవారీ సెలవులు ముగియడంతో రాహుల్ గాంధీ వెనక్కు వచ్చారు.. ఆయనను నేను ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను.. ఈ రోజు జరిగే మీడియా సమావేశంలో వాటికి సమాధానం చెబుతారని భావిస్తున్నాను’ అని పలు ప్రశ్నలను ట్విట్టర్ ద్వారా సంధించారు. అయితే నడ్డా ట్వీట్‌లపై రాహుల్ కూడా తీవ్రంగానే స్పందించారు. మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ.. ‘ఆయన ఎవరు.. నేనెందుకు సమాధానం చెప్పాలి? ఆయన నా ప్రొఫెసరా? నేను దేశానికి మాత్రమే సమాధానం చెబుతా’ అని అన్నారు. చైనా ఆక్రమణ నుంచి కరోనా వైరస్ సంక్షోభం, సాగు చట్టాలపై రైతు నిరసనల వరకు అనేక విషయాలపై అలాగే కాంగ్రెస్ నాయకుడిపై కూడా నడ్డా విరుచుకుపడ్డారు.
 
 
 రాహుల్ గాంధీ, వారి రాజవంశం, కాంగ్రెస్.. చైనాపై అబద్దాలాడటం ఎప్పుడు ఆగిపోతుంది? ఆయన ప్రస్తావిస్తున్న అరుణాచల్ ప్రదేశ్‌ సహా వేలాది కిలోమీటర్లు చైనీయులకు పండిట్ నెహ్రూ తప్ప మరెవరూ బహుమతిగా ఇవ్వలేదని ఆయన ఖండించగలరా? పదే పదే చైనాకు కాంగ్రెస్ ఎందుకు లొంగిపోతుంది? అని దుయ్యబట్టారు. వ్యవసాయ చట్టాలపై రైతులను రెచ్చగొట్టి, రాహుల్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కాగా, అరుణాచల్ బీజేపీ ఎంపీ తాపిర్ గవో మాట్లాడుతూ, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని వెనక్కి పంపించేందుకు భారత ఆర్మీ ఎలాంటి ఆపరేషన్‌ చేపట్టకుండా నాటి ప్రధాని రాజీవ్‌గాంధీనే ఆపినట్టు ఆరోపించారు. 80వ దశకంలోనే చైనా రోడ్డు నిర్మాణం జరిపిందని, లాంగ్జూ నుంచి మజా రోడ్డు నిర్మించినది కూడా రాజీవ్ హయాంలోనేని, తవాంగ్‌లోని ఒక వ్యాలీని ఆక్రమించుకుందని అన్నారు. అప్పటి ఆర్మీ చీఫ్ పీఎల్‌ఏను వెనక్కి పంపేందుకు ఆపరేషన్ చేపట్టాలనుకుని ప్లాన్ చేసినప్పటికీ రాజీవ్ గాంధీ అనుమతించలేదని చెప్పారు. కాంగ్రెస్ తప్పుడు విధానంలో వెళ్లిందని, కనీసం సరిహద్దుకు రోడ్డు కూడా నిర్మించలేకపోయిందని అన్నారు. ఇలా సరిహద్దుల్లో కొత్త గ్రామాల నిర్మాణం కొత్తేమీ కాదని, ఇదంతా కాంగ్రెస్ చలవేనని బీజేపీ ఎంపీ అన్నారు.









మరింత సమాచారం తెలుసుకోండి: