ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి నెలరోజుల్లోపే జగన్ ప్రభుత్వం ప్రమోషన్‌ ఇచ్చింది. శ్రీలక్ష్మీ ఇటీవలే తెలంగాణ రాష్ట్రం నుంచి రిలీవై ఏపీకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ కార్యదర్శిగా శ్రీలక్ష్మీ పదవీ బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఆమెను కార్యదర్శి ర్యాంక్ నుంచి ముఖ్య కార్యదర్శిగా ఏపీ ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. శ్రీలక్ష్మిపై కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసుల తీర్పులు, డీవోపీటీ నిర్ణయం మేరకు ఇది అమలు జరుగుతుందని, తుది తీర్పులకు లోబడే ఉత్తర్వుల కొనసాగింపు ఉంటుందని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులో స్పష్టం చేశారు.
                              రాష్ట్ర విభజన సమయంలో శ్రీలక్ష్మిని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించింది. వాస్తవానికి ఆమె స్వస్థలం విశాఖపట్నం కాగా, పోస్టల్ అడ్రస్ హైదరాబాద్ ఉండటంతో కేంద్రం ఆమెను తెలంగాణకు కేటాయించింది. అప్పటి నుంచి సొంత రాష్ట్రానికి వచ్చేందుకు ఆమె ప్రయత్నాలు చేశారు. అయితే 2014 లో ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఉండటంతో ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ గెలిచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో శ్రీలక్ష్మి మళ్లీ ఏపీకి వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించి సఫలమయ్యారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీలక్ష్మి గనులశాఖ కార్యదర్శిగా పనిచేశారు. అంతేకాదు ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో ఓబుళాపురం మైనింగ్ కు అనుమతుల విషయంలో క్యాప్టివ్ మైనింగ్ అనే పదాన్ని తొలగించడం ద్వారా గాలి జనార్ధనరెడ్డికి భారీగా లబ్ధి చేకూరింది. దీంతో శ్రీలక్ష్మి అవినీతికి పాల్పడినట్లు ఆరోపణల వచ్చాయి. వైఎస్ మరణం తర్వాత సీబీఐ మైనింగ్ తో పాటు జగన్ పై అక్రమాస్తుల కేసులు నమోదు చేయడంతో ఆమె జైలు కూడా వెళ్లాల్సి వచ్చింది. జైలులో శ్రీలక్ష్మీ ఆరోగ్యం క్షీణించడం ఆ తర్వాత కోలుకోవడం జరిగింది. తమ వల్ల ఇబ్బందులు పడిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీకి జగన్ తన ప్రభుత్వంలో ఉన్నతస్థానం అందిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: