తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్.. తక్కువ కాలంలోనే ప్రజాదరణ కోల్పోతున్నారా.. ఒక దాని వెనుక ఒకటి వరుసగా తప్పులు చేస్తున్నారా.. ఆయన చేస్తున్న తప్పులు ఒకట్లు, పదులు దాటిపోతన్నాయా.. అవునంటున్నారు  తెలుగు దేశం నేతలు. జగన్ రెడ్డి శిశుపాలుడిని మించి 20నెలల్లోనే వందలాది తప్పులు చేశాడని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడుతున్నారు. తిరుపతి పార్లమెంట్ నేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

వైకాపా పతనానికి తిరుపతి ఉపఎన్నికతో నాంది పలకాలని చంద్రబాబు శ్రేణులకు పిలుపునిచ్చారు. తిరుపతి నుంచే వైకాపా దాడులు, విధ్వంసాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు.  హింసా విధ్వంసాలను వెంకటేశ్వర స్వామి సహించడని స్పష్టం చేశారు. వైకాపా దుర్మార్గాలపై జనవరి 21వ తేదీ నుంచి తిరుపతి పార్లమెంట్ పరిధిలో ధర్మపరిరక్షణ యాత్ర నిర్వహించనున్నట్లు  తెలిపారు. 10రోజులపాటు 700గ్రామాల్లో జరిగే ఈ యాత్రలో వైసీపీ దుర్మార్గాలను నిలదీసి అన్ని వర్గాల ప్రజలను చైతన్య పరచాలన్నారు.

ప్రజల ప్రాణాలు తీయటం వైసీపీకి  నిత్యకృత్యంగా మారిందని చంద్రబాబు దుయ్యబట్టారు. 20నెలల్లో 2వేల మంది రైతుల ఆత్మహత్యలు, 16మంది తెదేపా కార్యకర్తల హత్య, 1,350చోట్ల భౌతికదాడులు, 400మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగాయన్నారు. రాష్ట్రాన్ని రావణకాష్టంలా, ఉన్మాదుల రాజ్యంగా మార్చారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీటెక్ రెడ్డి జగన్ పై భవిష్యత్తులో పోటీ చేస్తాడనే అక్కసుతోనే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు.  ఓ ఎమ్మెల్యే ఏకంగా జిల్లా ఎస్పీని బహిరంగ సభలో బెదిరిస్తే, మరో ఎమ్మెల్యే వేధింపులు భరించలేక మహిళా ఎంపీడీవో పోలీస్ స్టేషన్ లో అర్థరాత్రి ధర్నా చేసిందని గుర్తు చేశారు.  

రాష్ట్రంలో అరాచకాలన్నింటికీ జగన్ రెడ్డే కారణమన్న చంద్రబాబు.. డీజీపీ వల్లే శాంతిభద్రతలు అధ్వానంగా ఉన్నాయన్నారు. పదవుల కోసం వైకాపాతో కుమ్మక్కైన కొందరు పోలీసుల అండ చూసుకునే  క్రిమినల్ గ్యాంగ్స్ రెచ్చిపోతున్నాయని అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: