న్యూఢిల్లీ : రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్ణబ్ గోస్వామికి సంబంధించిన దాదాపు 500 పేజీల చాట్ లీక్‌ అయిన విషయం తెలిసిందే. ఈ చాట్‌లో అధికార, ప్రతిపక్షాలపై ఆయన చేసిన విమర్శలు, వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా బాలాకోట్ దాడుల విషయం కూడా తనకు ముందుగానే తెలుసంటూ ఈ చాట్‌లో అర్ణబ్ చెప్పినట్లుగా ఈ చాట్‌లో ప్రత్యక్షం కావడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 2019 ఫిబ్రవరి 14న జమ్మూ-కశ్మీరులోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ వాహనంపై ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 40 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది అమరులయ్యారు. ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పేందుకు భారత ప్రభుత్వం బాలాకోట్‌పై వైమానిక దాడులు జరిపింది. 2019 ఫిబ్రవరి 26న బాలాకోట్‌లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు జరిగాయి. దీనికి ప్రతీకారంగానే భారత్ ఈ బాలాకోట్ దాడులు చేసింది.

అర్ణబ్ చాట్‌లో బాలాకోట్ దాడుల విషయం ఉండడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా స్పందించారు. అర్ణబ్‌కు విషయాలను చేరవేసిన వారిది క్రమినల్ చర్య అని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికార రహస్యాలను జర్నలిస్ట్‌కు ఇవ్వడం నేరమని, ఈ సమాచారాన్ని ఇచ్చినవారు, పుచ్చుకున్నవారు ఇద్దరూ శిక్షార్హులేనని, వారిని జైలుకు పంపాల్సి ఉంటుందని డిమాండ్ చేశారు.

మంగళవారం మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ.. బాలాకోట్‌పై జరిగిన వైమానిక దాడుల సమాచారం అర్నాబ్ గోస్వామికి ముందుగానే తెలిసిందనే ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటి సీక్రెట్ ఆపరేషన్స్‌కు సంబంధించిన సమాచారం కేవలం ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి, హోం మంత్రి, వాయు సేన చీఫ్, జాతీయ భద్రతా సలహాదారులకు మాత్రమే తెలుస్తుందని, కనీసం యుద్ధ విమానం పైలట్‌కు సైతం ఇవ్వరని, అలాంటిది ఓ సాధారణ జర్నలిస్టుకు ఆ సమాచారం ఎలా చేరిందని ప్రశ్నించారు. ఈ ఐదుగురిలో ఎవరో ఒకరు సమాచారాన్ని అర్ణబ్‌కు ఇచ్చి ఉంటారని ఆరోపించారు. ఇలా చేయడం క్రిమినల్ చర్య అని, ఆ పని చేసిన వారిని కనిపెట్టి శిక్షించాలని అన్నారు.
సమాచారాన్ని ఇచ్చినవారే కాకుండా తీసుకున్నవారు కూడా కచ్చితంగా జైలుకు వెళ్లాల్సిందేనని రాహుల్ అన్నారు.  సాధారణంగా అయితే ఇప్పటికే ఈ ప్రక్రియ మోదలైపోయి ఉండాలని, కానీ ఆ సమాచారాన్ని అర్ణబ్‌కు ప్రధానమంత్రి మోదీనే ఇచ్చి ఉంటారని, అందువల్ల అలాంటి యాక్షన్‌లేవీ తీసుకోరని సంచలన ఆరోపణలు చేశారు.

‘వీరంతా తాము దేశభక్తులమని చెప్పుకుంటారు. వాయుసేనను ఇబ్బందుల్లోకి నెట్టడం దేశభక్తి కాదు. దాడుల వల్ల రాజకీయ ప్రయోజనాలు పొందడం దేశభక్తి కాదు. అర్ణబ్ గోస్వామికి ఈ విషయం తెలిసిందంటే, అది ఆయన వాట్సాప్‌లో ఉంటే, ఆ విషయం పాకిస్థాన్‌కు తెలియకుండా ఉంటుందా..? కచ్చితంగా తెలిసే ఉంటుంది’ అని రాహుల్ అన్నారు.  దీనిపై కచ్చితంగా దర్యాప్తు చేయాని, అది త్వరగా ప్రారంభం కావాలని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: