ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారం విషయం మరలా చర్చల్లోకి వచ్చింది. దానికి ప్రధాన కారణం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ సీఐడీ పెట్టిన కేసులను హైకోర్టు కొట్టివేయటమే... రాజధాని భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ పోలీసులు గతంలో కేసులు నమోదు చేయగా.. వాటిని కొట్టివేయాలంటూ కిలారి రాజేష్‌‌తో పాటూ మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భూములు అమ్మిన వారెవరూ ఫిర్యాదులు చేయలేదని, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఐపీసీ సెక్షన్లు వర్తించవని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. భూములు అమ్ముకున్నవారు ఫిర్యాదు చేయకుండా కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం.. చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంత భూముల వ్యవహారంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ జరగలేదని పేర్కొంటూ.. దీనికి ఐపీసీ సెక్షన్లకు వర్తించవని హైకోర్టు స్పష్టం చేసింది. విచారణ అనంతరం కిలారి రాజేష్ మరియు కొందరు వ్యక్తులపై కేసులను ధర్మాసనం కొట్టివేసింది. కిలారు రాజేష్‌తో పాటు మరికొంత మంది రాజధాని అమరావతి ప్రాంతంలో భూములు ముందుగానే కొనుగోలు చేశారని సీఐడీ కేసులు నమోదు చేసింది. రాజధానిలో ఉన్న ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదు చేసింది. సీఐడీ కేసులను హైకోర్టు కొట్టేయడంతో జగన్ సర్కార్‌ కాసింత నిరాశకు గురి అయింది.



ఇక గతంలో అమరావతిలో జరిగిన జనభేరి సభలో ఈ విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు మంత్రి కొడాలి నాని కౌంటర్ ఎటాక్ గా... అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగితే ఏం చేశారని జగన్‌ను అడుగుతున్నారని.. తాము అక్కడ ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన అందరి పేర్లు బయటపెట్టామన్నారు. దీనిపై ఏసీబీ, సీఐడి కేసులు పెడితే వెళ్లి స్టేలు తెచ్చుకున్నారని.. గత ప్రభుత్వం హయాంలో రాజధాని వస్తుందని ముందే తెలిసి.. బినామీలతో పొలాలు కొనుగోలు చేయించారని ఆరోపించారు. అలాగే ఇప్పుడు అమరావతిలో భూముల ధరలు తగ్గిపోతాయని కొంతమందిని రెచ్చగొట్టి రోడ్డుపై కూర్చోబెట్టి చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని నాని మండిపడ్డ సంగతి కూడా తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: