ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల విషయమై జరుగుతున్న రగడ అంతా ఇంతా కాదు. మొదట్లో అధికార మరియు ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధంతో మొదలై ఆ తరువాత ఏకంగా అధికార పార్టీ మరియు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిల మధ్య వివాదంగా మారింది. ఎవరి ఆలోచనలతో వారు చెప్పే కారణాలు వినటానికి సమంజసంగా అనిపించినప్పటికీ న్యాయపరమైన పోరాటానికి సిద్ధమయ్యారు ఇరు వర్గాలు. ఇక తాజాగా ఈ స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. మంగళవారం ఈ పిటిషన్‌పై హైకోర్టు సీజే జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ ముగించింది. ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ గతంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ హైకోర్టును ఆశ్రయించగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్నికల కమిషన్‌ వాదనలు వినిపించాయి. ఈకేసులో ఉపాధ్యాయులు, ఉద్యోగుల తరఫున ఇంప్లీడ్‌ పిటిషన్‌ను దాఖలు చేయగా ధర్మాసనం కొట్టివేసింది.



సోమవారం ఇరువురి వాదనలు వినిపించగా.. మంగళవారం కూడా కొనసాగాయి. ఎస్‌ఈసీ తరఫున సీనియర్‌ లాయర్ ఆదినారాయణరావు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో కొవిడ్‌ ఆంక్షల సడలింపు క్రమంగా పెరుగుతోందని.. కరోనా నిబంధనలు పాటిస్తూనే ఎవరి కార్యకలాపాలు వారు చేసుకుంటున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కరోనా క్రమేపీ తగ్గుతోందని.. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించటానికి ఉన్న అడ్డంకులు ఏమిటో అర్థం కావడం లేదన్నారు. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈసీ ప్రయత్నిస్తోంది తప్ప మరో ఉద్దేశం లేదని.. ఎన్నికలు నిర్వహిస్తే వ్యాక్సినేషన్‌కు ఎలాంటి ఇబ్బందీ ఉండదన్నారు. ఒకసారి ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోకూడదని.. ఇంత వరకు ఎక్కడా జరగలేదన్నారు. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఈ వాదను విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: