న్యూఢిల్లీ: సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. దాదాపు 7-8 నెలలుగా చైనా భారత భూభాగాలను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలను భాతర సైన్యం దీటుగా తిప్పి కొడుతోంది. అయినా డ్రాగన్ తగ్గడం లేదు. సరిహద్దులో భారత భూభాగాల్లోకి చొచ్చుకొచ్చి మరీ నిబంధనలను అతిక్రమిస్తోంది. ఇప్పటికే తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో భారత్-చైనా సైన్యాలు నిరంతరం పహారా కాస్తుున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పడు తాజాగా డ్రాగన్ కన్ను ఈశాన్య రాష్ట్రాలపై పడింది.

అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దుల్లో వెంబడి దాదాపు నాలుగున్నర కిలోమీటర్ల మేర ఆక్రమించింది. అక్కడ ఏకంగా ఓ గ్రామాన్ని నిర్మించింది. దాదాపు 101 ఇళ్లు ఉన్న గ్రామాన్ని ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన శాటిలైట్‌ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరలవుతున్నాయి. గతేడాది నవంబర్‌లోనే చైనా డోక్లాం ఘర్షణ స్థావరానికి అతి సమీపంలో ఓ గ్రామాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు వాస్తవ సరిహద్దుకు నాలుగున్నర కిలోమీటర్ల దూరంలోనే మరో గ్రామాన్ని నిర్మించింది. దీని గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. తాజాగా చైనా నిర్మించిన గ్రామం భారత్‌-చైనాల మధ్య వివాదాస్పదంగా ఉన్న ఎగువ సుబన్సిరి జిల్లా సారిచు నది ఒడ్డున ఉంది. ఇక్కడ నిత్యం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతుంటాయి.

ప్రస్తుతం చైనా గ్రామాన్ని నిర్మించిన ప్రాంతంలో 2019 ఆగస్టు నాటి శాటిలైట్‌ ఫోటోల్లో ఎలాంటి నిర్మాణాలు లేవు. 2020 నవంబర్‌ చిత్రాల్లోమాత్రం వరుసగా ఇళ్లు దర్శనమిచ్చాయి. అంటే ఏడాది వ్యవధిలోనే చైనా ఇక్కడ గ్రామాన్ని ఏర్పాటు చేసినట్లు ఈ ఫోటోల్లో స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయంపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖను భారత్ సంప్రదించినా సరైన స్పందన లభించలేదు. అయితే భారత్ మాత్రం ఈ విషయాన్ని తీవ్రంగానే పరిగణిస్తోంది. సరిహద్దుల్లో చైనా కదలికలను భారత్ గమనిస్తూనే ఉందని, ప్రతి చర్యనూ సునిసితంగా పరిశీలించి కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చైనాకు వార్నింగ్ ఇచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: