అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జనసేన కార్యకర్త ఆత్మహత్యపై ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. గ్రామంలో అభివృద్ధి జరగాలని చూసిన జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు గొంతు నొక్కేశారని నాదెండ్ల మనోహర్ అన్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు, స్థానిక వైసీపీ నేతల వేధింపుల కారణంగానే వెంగయ్య ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన ఆరోపణలు చేశారు. వెంగయ్య కుటుంబానికి జనసేన పార్టీ తరఫున 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. స్వయంగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ ఆర్థిక సాయం అందచేస్తామని తెలిపారని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు చూస్తుంటే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఉన్నాయని, ఇక్కడ ప్రజా స్వామ్యం నిజంగా విఫలమైందని ఆందోళన చెందారు. ప్రజా స్వామ్యంలో ఇలాంటి సంఘటనలు జరగడంపై ప్రతి ఒక్కరు ప్రశ్నించాలని, ఇది సమాచానికి శుభ సూచకం కాదని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారని నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు. ఇలాంటి చర్యలను జనసేన పార్టీ కచ్చితంగా ఖండిస్తోందని, ఈ పరిణామాలు రాష్ట్రానికి గానీ, దేశానికి గానీ మంచిది కాదని అన్నారు. ఏ పార్టీ కూడా ఎప్పుడూ అధికారంలోనే ఉండటం జరగదని, రాజకీయాల్లో గెలుపు ఓటమి రెండూ పక్కపక్కనే ఉంటాయన్న విషయాన్ని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

శుక్రవారం.. గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రకాశం జిల్లా బేస్తవారపేట మండలం శింగరపల్లె వచ్చారు. అభివృద్ధి పనులు ఎందుకు చేయడం లేదంటూ ఆ గ్రామ జనసేన కార్యకర్తలు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ‘ముందు మెడలో టవల్‌ తీసెయ్‌రా. మెడలో ఒక పార్టీ కండువా వేసుకొని, నలుగురు తాగుబోతులను వెంటేసుకువచ్చి ప్రశ్నిస్తే మేం సమాధానం చెప్పాలా?’ అంటూ ఆగ్రహంతో ఊగిపోతూ బూతులు తిట్టారు. ఈ ఘటన జరిగిన రెండు రోజులకే జనసేన కార్యకర్త వెంగయ్య ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: