విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మంత్రి కొడాలి నాని, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు మధ్య జరుగుతున్న వాగ్వాదం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. కొడాలి నాని చేసిన సవాల్ స్వీకరించిన మాజీ మంత్రి దేవినేని.. గొల్లపూడి సెంటర్‌ లో మంగళవారం ఉదయం దీక్షకు దిగారు. ఈ దీక్షకు ఎలాంటి అనుమతులూ లేవంటూ దేవినేని ఉమను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో టీడీపీ వర్గాలు నిరసనలు దిగాయి. పోలీసులు తమ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దేవినేని ఉమను ఈరోజు సాయంత్రం పోలీసులు విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కొడాలి నానిపై దేవినేని ఉమ తీవ్రస్థాయిలో మండి పడ్డారు. బూతుల మంత్రి కొడాలి నాని ఇప్పుడు ఓ పోరంబోకు మంత్రిగా మారిపోయాడని ఎద్దేవా చేశారు. కొడాలి నానికి అసలు చదువే లేదని.. సంస్కారం లేదని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కొడాలి నానిని పశువులతో కూడా పోల్చలేమని, అలా పోల్చడం కూడా తప్పేనని అన్నారు. జగన్‌ ఎవరి కాళ్లు పట్టుకోవడానికి ఢిల్లీ వెళ్లారు? అని ప్రశ్నించారు. డిబేట్‌కి స్పెల్లింగ్ కూడా తెలియని వారితో నేను చర్చించేది ఏంటని వ్యాఖ్యానించారు. కనీసం ఆ స్థాయి కూడా కొడాలి నానికి ఉందా? అంటూ దేవినేని ఉమ ఆగ్రహంతో ఊగిపోయారు.

దేవినేని ఉమను పోలీసులు అరెస్టు చేసిన సమయంలో కొడాలి నాని మాట్లాడుతూ.. దీక్షకు పోలీసులు ఒప్పుకోరని తెలిసే దేవినేని ఇలా నాటకం ఆడుతున్నారని విమర్శలు గుప్పించారు. ‘దేవినేని ఉమా.. దమ్ము, ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలి. మీడియా సమక్షంలోనే రెండు పార్టీల మేనిఫెస్టో గురించి చర్చిద్దాం. అక్కడే కొట్టకపోతే నేను రాష్ట్రం విడిచి వెళ్ళిపోతా. సొల్లు ఉమా సొల్లు కబుర్లు చెబుతాడు. బహిరంగ చర్చకు సిద్ధమని రాత్రి నుంచి ఉమకు 10 సార్లు ఫోన్ చేశాను. ఉమతో ఎలాంటి చర్చకైనా నేను రెడీ. నేను చర్చకు రమ్మంటే దేవినేని నాటకాలాడుతూ కాలక్షేపం చేస్తున్నాడు’ అని నాని విమర్శల వర్షం కురిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: