ఏపీలో రాజకీయాలు మరీ రోత పుట్టిస్తున్నాయి. 151 ఎమ్మెల్యేల బలం ఉన్న వైసీపీ.. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోయడం విస్తుగొలుపుతోంది. అప్పటికీ జనసేన నుంచి ఒకరిని, టీడీపీ నుంచి నలుగురిని తమవైపుతిప్పుకున్నా కూడా ఇంకా ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం మానలేదు వైసీపీ. అటు టీడీపీ కూడా తగుదునమ్మా అంటూ ఇలాంటి తిట్ల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నట్టే కనిపిస్తోంది. మాటకు మాట పెంచుకుంటూ పోతోంది.

దమ్ముంటే రా..
మగాడివైతే రా..
నిన్ను కొడతా..
నీ ఇంటికొచ్చి మరీ కొడతా..
బజారులో మాట్లాడుకునే మాటలు కాదు.. మన రాజకీయ నాయకులే బరితెగించి మాట్లాడుకుంటున్న మాటలివి. రాజకీయ వైరుధ్యాలు అన్ని పార్టీల మధ్య ఉంటాయి, అందరి నాయకుల మధ్య ఉంటాయి. అయితే అంత మాత్రాన మరీ ఇలా బరితెగించి రోడ్డుపై పడటం, సవాళ్లు విసురుకోవడం, మీడియా ఛానెళ్లకు 24గంటలు మేత సమకూరేలా చేయడం, దానిపై చర్చోపచర్చలు ఇదంతా దేనికి సంకేతం. అసలు సామాన్య ప్రజలకు ఈ తిట్ల దండకాలు, సవాళ్లతో ఒరిగేదేమైనా ఉందా? కనీసం పై స్థాయిలో ఉన్న నాయకులైనా తమ వారిని అదుపులో పెట్టుకుంటున్నారా అంటే అదీ లేదు. ఎంత బాగా తిట్టుకుంటే అంత బాగా సంతోషించినట్టుంది వారి పరిస్థితి.

ఇది కేవలం కొడాలి నానికి, దేవినేని ఉమకి మాత్రమే సంబంధించిన అంశం కాదు. వైసీపీలో చాలామంది నాయకులు టీడీపీ నేతల్నిటార్గెట్ చేశారు. టీడీలో దాదాపు అందరూ వైసీపీ నేతలపై తిట్ల దండకం అందుకుంటున్నారు. పనిలో పనిగా వైసీపీ నాయకులు పవన్ కల్యాణ్ పై కూడా తీవ్ర విమర్శలు సంధిస్తున్నారు. అయితే జనసేన కానీ, బీజేపీ కానీ ఈ రాజకీయ రొచ్చులోకి రాకపోవడం గమనార్హం. కాస్తో కూస్తో బీజేపీ, జనసేన నాయకులు మాత్రమే గౌరవంగా మాట్లుడుతున్నారు, హుందాగా రాజకీయాలు చేస్తున్నారు. మరోవైపు ఈ తిట్ల రాజకీయాలను ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నారు. సామాన్యులకు ఈ ఎపిసోడ్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, పైపెచ్చు.. ఏ ఛానెల్ లో చూసినా ఇవే సవాళ్లు, ప్రతి సవాళ్లు. సవాళ్లపై ఉన్న శ్రద్ధ.. ప్రజల సమస్యల పరిష్కారంపై పెట్టాలని కోరుతున్నారు సామాన్యులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: