ఏపీలో మంత్రి కొడాలి నాని, మాజీ మంత్రి దేవినేని ఉమాల మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. ఎప్పటినుంచో ఈ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే విషయం తెలిసిందే. ఒకప్పుడు టీడీపీలో ఉన్నప్పుడే వీరికి పెద్దగా పడేది కాదు. ఎప్పుడైతే నాని వైసీపీలోకి వెళ్లారో అప్పటినుంచి దేవినేని టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు నాని మంత్రి కూడా కావడంతో ఉమాపై మరింతగా విరుచుకుపడుతున్నారు.

ఏ మాత్రం మొహమాటం లేకుండా పరుష పదజాలంతో దూషిస్తున్నారు. అటు ఉమా కూడా కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వీరి మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. కొడాలి, ఉమా సొంత నియోజకవర్గం మైలవరం వెళ్ళి మరీ తిట్టారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే ఇంటికి వచ్చి ఉమాకి బడిత పూజ చేస్తానని హెచ్చరించారు.

దీంతో కొడాలి ఏం చేస్తారో చూస్తానని, దమ్ముంటే మైలవరం రావాలని, గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం దగ్గర దీక్షకు దిగడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు ఉమాని అరెస్ట్ చేసి, రోజంతా తిప్పి వదిలేశారు. ఇక కొడాలి బదులు, వల్లభనేని వంశీ అక్కడకెళ్లి ఉమాపై విరుచుకుపడ్డారు. ఇలా ఉమాని కొడాలి-వంశీలు టార్గెట్ చేసి బూతుల వర్షం కురిపిస్తున్నారు. ఉమాపై వైసీపీ నేతల మాటల దాడిని కృష్ణా జిల్లాలోని పలువురు టీడీపీ నేతలు ఖండించారు.

కొనకళ్ళ నారాయణ, కొల్లు రవీంద్ర, నెట్టెం రఘురాం లాంటి వారు కొడాలిపై విమర్శలు చేశారు. విజయవాడలో కీలకంగా ఉన్న ఎంపీ కేశినేని నాని, గద్దె రామ్మోహన్‌లు ఈ విషయంపై స్పందించలేదు. అయితే కేశినేని-గద్దెలకు కూడా ఉమా అంటే పెద్దగా పడదు. జిల్లాలో ఉమా పెత్తనం వల్ల వీరు ఇబ్బందులు పడ్డారు. అందుకే ఇప్పుడు ఏం మాట్లాడటం లేదు. పైగా వీరు కొడాలి, వంశీలపై పెద్దగా విమర్శలు చేసిన సందర్భాలు లేవు. మొత్తానికైతే ఉమాకు సొంత పార్టీ నేతలే మద్ధతు కరువైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: