విజయనగరం జిల్లా రామతీర్థంలో రాములవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దానిపై రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ కాక రేగిన నేపథ్యంలో విగ్రహాల పునఃప్రతిష్టకోసం ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. తిరుపతిలో విగ్రహాల తయారీ పూర్తయింది.త్వరలోనే వీటిని తీసుకొచ్చి రామతీర్థంలోని శ్రీరాముల వారి ఆలయంలో ప్రతిష్టిస్తారు.

తిరుపతిలోని టీటీడీ శిల్ప శాలలో ఈ విగ్రహాలు రూపుదిద్దుకున్నాయి. విగ్రహాల తయారీకి దేవాదాయశాఖ నుంచి టీటీడీకి ఈనెల 8న విజ్ఞప్తి వచ్చింది. ఈమేరకు దేవాదాయ శాఖ అధికారులు, మరికొంతమంది అర్చక స్వాములు తిరుపతి వచ్చి విగ్రహాల నమూనాలను ఖరారు చేశారు. ఆ వెంటనే కంచి నుంచి కృష్ణశిలను తెప్పించారు టీటీడీ అధికారులు. ముగ్గురు స్థపతులు విగ్రహాల తయారీని మొదలు పెట్టారు. శ్రీరాముడి విగ్రహం పీఠంతో కలిపి మూడున్నర అడుగుల ఎత్తు, సీతమ్మ, లక్ష్మణుల విగ్రహాలు పీఠంతో కలిపి 3 అడుగుల ఎత్తులో తయారయ్యాయి.

విగ్రహాల తయారీకి 15రోజుల సమయం పడుతుందని అన్నా కూడా.. 10రోజులలోపే వాటిని పూర్తి చేశారు స్థపతులు. ఈనెల 21న వీటిని టీటీడీ శిల్ప తయారీ కేంద్రం నుంచి తరలిస్తారని తెలుస్తోంది. పూజాధికాల అనంతరం దేవాదాయ శాఖ అధికారులు శిల్పాలను రామతీర్థం తరలిస్తారు. అక్కడ పునఃప్రతిష్టిస్తారు.

రామతీర్థంలో రాములవారి విగ్రహం ధ్వంసం తర్వాత రాష్ట్రంలో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశాయి. బీజేపీ, జనసేన నాయకులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆలయాల ఘటనలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, అందుకే ఇలాంటివి పునరావృతం అవుతున్నాయని మండిపడ్డారు నేతలు. దీంతో ప్రభుత్వం వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఆఘమేఘాల మీద విగ్రహాలను తయారు చేయించి అక్కడ పునఃప్రతిష్టిస్తున్నారు.

బీజేపీ-జనసేన చొరవతోనే ప్రభుత్వం త్వరితగతిన రామతీర్థం విగ్రహాల పునఃప్రతిష్టకు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. రామతీర్థం వ్యవహారంలో ప్రభుత్వం ఇబ్బంది పడినా.. వెంటనే ఆ ఘటనపై విచారణ జరిపించింది. ఇప్పుడు విగ్రహాల పునఃప్రతిష్టతో ప్రభుత్వం తన ప్రతిష్ఠను కాపాడుకోవాలనుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: