రాజధాని ప్రాంతంలో ఇన్‌ సైడర్ ట్రేడింగ్‌ జరిగిందంటూ  జగన్ సర్కారు ఇన్నాళ్లూ చేస్తున్న వాదనలో ఏమాత్రం పసలేదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలు జగన్ ప్రభుత్వం ఇన్నాళ్లూ చేస్తున్న వాదనలో డొల్ల తనాన్ని బయటపెట్టింది. ఏపీ రాజధాని విజయవాడ ప్రాంతంలో వస్తుందని ఏకంగా ముఖ్యమంత్రే బయట పెట్టిన తర్వాత అది రహస్యం ఎందుకు అవుతుందని ఏపీ హైకోర్టు ప్రకటించింది. అంతే కాదు.. ఈ కేసులో పరిశీలించిన పత్రిక కథనాలను కూడా హైకోర్టు ఉటంకించింది.

ఆ పత్రికల కథనాలను పరిశీలిస్తే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చిన ఈ కథనాల సాక్షిగా జగన్ సర్కారు వాదనలోని డొల్లతనం బయటపడిందని చెప్పొచ్చు. ఇంతకీ ఆ పత్రికల్లో ఏం వచ్చింది.. హైకోర్టు ఏం చెప్పిందో చూద్దాం..

2014 జూన్‌ 9: ఆంధ్రప్రదేశ్‌ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వెంటనే... కృష్ణా-గుంటూరు జిల్లాల్లో, కృష్ణా నదీ తీరం వెంబడి కొత్త రాజధాని ఏర్పాటవుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ విషయం అన్ని ప్రముఖ తెలుగు, ఆంగ్ల దినపత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమైంది. 2014 జూన్‌ 10న ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ప్రకారం రాష్ట్రానికి భౌగోళికంగా నడిమధ్యలో, అందరికీ సమాన  దూరంలో ఉన్నందునే విజయవాడ-గుంటూరు మధ్య కొత్త రాజధాని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.


2014 జూలై 7న ఈనాడులో వచ్చిన కథనం ప్రకారం..  కృష్ణా నది తీరం వెంబడి ‘అమరావతి’ కేంద్రంగా కొత్త రాజధానిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజధాని ప్రాంతాన్ని అనుసంధానిస్తూ కొత్తగా భారీ వంతెనలు నిర్మిస్తారని తెలిసింది. 2014 జూలై 23న సాక్షి కథనం ప్రకారం.. కొత్త రాజధానికి సరైన ప్రాంతం కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్యనే అని, అక్కడే రాజధాని వస్తుందని సలహా కమిటీ అధ్యక్షుడు  మంత్రి నారాయణ ప్రకటించారు. ఢిల్లీలో శివరామకృష్ణన్‌ కమిటీని కలిసి ఈ విషయం వెల్లడించారు. మరి ఇన్ని కథనాలు వచ్చిన తర్వాత రాజధాని ప్రాంతంలో భూములు కొన్నా అది నేరం ఎలా అవుతుందని కోర్టు ప్రశ్నించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: