అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ కథ ముగియనుందా? అంటే ప్రస్తుతం వచ్చిన హైకోర్టు తీర్పుని చూస్తే అలాగే అనిపిస్తోంది. కొత్తగా ఏర్పడిన ఏపీకి చంద్రబాబు తొలి సీఎం అయిన విషయం తెలిసిందే. అలాగే రాజధాని నిర్మించే అద్భుత అవకాశం చంద్రబాబుకు వచ్చింది. దానికి తగ్గట్టుగానే చంద్రబాబు, కృష్ణా-గుంటూరు జిల్లాలకు మధ్యలో ఉన్న అమరావతి ప్రాంతంలో రైతుల దగ్గర నుంచి 33 వేల ఎకరాలు రాజధాని కోసం భూసమీకరణ చేశారు.

అయితే ఇన్ని వేల ఎకరాలు సమీకరించిన బాబు, ఐదేళ్లలో రాజధానిలో చేసిన అభివృద్ధి పెద్దగా లేదు. ఏదో కొన్ని తాత్కాలిక భవనాలు కట్టారు. మిగతావి గ్రాఫిక్స్‌లో చూపించారు. అయితే భూసమీకరణలో టీడీపీ నేతలు, చంద్రబాబు అనుచరులు ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేశారని అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్ ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన జగన్, మూడు రాజధానులని తెరపైకి తీసుకొచ్చి, ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై దృష్టి పెట్టి విచారణ మొదలుపెట్టి, పలువురు టీడీపీ నేతలు, టీడీపీకి అనుకూలంగా ఉన్నవారిపై కేసులు పెట్టించారు.

ఇది రాజ‌కీయంగా పెద్ద దుమార‌మే రేపింది. జ‌గ‌న్ ఓ కులాన్ని టార్గెట్‌గా చేసుకుని విమ‌ర్శ‌లు చేశారు. అమ‌రావతి ఓ కులం వాళ్ల‌కే అన్న ప్ర‌చారం హైలెట్ చేశారు. త‌మపై కేసులు పెట్టిన త‌ర్వాత దీనినిపై వారు హైకోర్టుకు వెళ్లారు. అయితే కోర్టు జగన్‌కు ఎదురుదెబ్బ తగిలేలా తీర్పు ఇచ్చింది. రాజధాని భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ.. సీఐడీ పెట్టిన కేసులను హైకోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలోనే భూములు అమ్ముకున్నవారు ఫిర్యాదు చేయకుండా కేసులు ఎలా పెడతారని కోర్టు, సి‌ఐడీని ప్రశ్నించింది.

చివరకు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ జరగలేదని పేర్కొంటూ.. దీనికి ఐపీసీ సెక్షన్లకు వర్తించవని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక ఇలా జరగడంతో జగన్, వైసీపీ నేతలు నడిపిస్తున్న ఇన్‌సైడర్ ట్రేడింగ్ కథ ముగిసినట్లే కనిపిస్తోంది. జగన్ రాజకీయంగా టీడీపీని దెబ్బకొట్టడానికే ఇన్‌సైడర్ ట్రేడింగ్ అస్త్రం వదిలినట్లు క్లియర్‌గా అర్ధమైపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: