ఏపీ సీఎం జగన్ క్యాబినెట్ లోని మంత్రి కొడాలి నాని చేసే వ్యాఖ్యలు ఎప్పుడూ కూడా చర్చనీయాంశంగా మారుతూ ఉంటాయి.. ఆయన మంత్రిగా బాధ్యతాయుత పదవిలో ఉండి కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతూ తన వైఖరి ఎలాంటిదో చాలా సందర్భాల్లో బయట పెట్టాడు. ఆయన మాట్లాడే విధానంపై సర్వత్ర విమర్శలు వస్తున్నప్పటికీ నాని తన వైఖరి మార్చుకోవడం లేదు అనేది పలువురి అభిప్రాయం. తాజాగా దేవినేని ఉమా పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి.

 "జగన్ ను విమర్శిస్తే బహిరంగంగానే కొడతా" అంటూ ఉమా పై నాని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మచిలీపట్నంలో సమాచారశాఖ మంత్రి పేర్ని నాని తనయుడి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌, పీకేఎం క్రికెట్‌ టోర్నమెంటును మంగళవారం  కొడాలి నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘నేను గొల్లపూడిలో చేసిన వ్యాఖ్యలపై దేవినేని ఉమా స్పందించిన తీరు బాగాలేదు అంటూ మండిపడ్డారు. బహిరంగ చర్చకు రావాలంటూ హడావుడి చేస్తే పోలీసులు అనుమతి ఇవ్వరనే విషయం తెలుసుకుని ఉమా చౌకబారు రాజకీయాలు చేస్తున్నాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

నువ్వు సూచించిన మీడియాలో ఇద్దరం ఒంటరిగా చర్చలో పాల్గొందాం. ఆ సందర్భంగా నువ్వు ఇష్టానుసారం జగన్‌ను తిడితే అక్కడే కొడతా అంటూ కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలా కానీ పక్షంలో నేను రాష్ట్రం వదిలి వెళ్లిపోతా’ అని అన్నారు. అయితే నాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమి కాదు. చాలా సందర్భాలలో పలు నాయకులపై ఇంతే స్థాయిలో రెచ్చిపోయారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నాని తన నోటిని అదుపులో పెట్టుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ రౌడీ  రాజకీయం చేస్తాడని ఇప్పటికే చాలా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మరి ముందు రోజులలో కూడా నాని ఇదే తీరు ప్రవర్తిస్తాడా.. లేక తన వైఖరి మార్చుకుంటాడా.. అన్నది చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: