స్థానిక ఎన్నికల కోసం హైకోర్టులో ఓవైపు వాదోపవాదాలు జరుగుతున్నాయి. మరోవైపు ఏపీ ఉద్యోగులు కూడా ప్రభుత్వానికి మద్దతుగా ఎన్నికలు వద్దంటూ భీష్మించుకు కూర్చున్నారు. రెవెన్యూ, పోలీస్ ఉద్యోగులు నేరుగా ఎన్నికల కమిషన్ కే ఈ మేరకు విజ్ఞప్తి చేయగా, తాజాగా మరోసారి ఏపీ జేఏసీ అమరావతి టీమ్.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ని కలసి వినతిపత్రం సమర్పించింది. ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాతే స్థానిక ఎన్నికలు జరపాలని విజ్ఞప్తి చేశారు నేతలు. ఎన్నికల కమిషన్ పంతానికి పోయి ఉద్యోగుల ప్రాణాలు పణంగా పెడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో స్థానిక ఎన్నికలపై పీటముడి ఇంకా విడిపోలేదు. ఓవైపు ప్రభుత్వం ఎన్నికలు వద్దంటుంటే.. మరోవైపు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ మాత్రం జరిపి తీరాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. పంచాయతీ ఎన్నికలకు ఏకంగా నోటిఫికేషన్ కూడా ఇచ్చేశారు. అయితే ఆ నోటిఫికేషన్ ను సింగిల్ జడ్జ్ కొట్టేయడంతో ఇప్పుడు పంచాయితీ హైకోర్ట్ ఫుల్ బెంచ్ ముందుకు వెళ్లింది.

మరోవైపు ఉద్యోగులు మాత్రం టీకా ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికలు వద్దంటున్నారు. అయితే కేవలం ఉద్యోగులకు టీకా వేస్తే సరిపోతుందా, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే ఓటర్లకు వ్యాక్సినేషన్ వద్దా అనేది మరో ప్రశ్న. నిరంతరంగా సాగే వ్యాక్సినేషన్ ప్రక్రియ తొలి విడత పూర్తయిన తర్వాతే ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఏపీలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. అయితే వైద్య సిబ్బంది చాలా వరకు వ్యాక్సినేషన్ కు వెనకాడుతున్నట్టు తెలుస్తోంది. తొలి మూడు రోజుల్లో లక్ష మందికి టీకాలు వేయాల్సి ఉండగా.. కనీసం 45వేలమంది కూడా ముందుకు రాలేదు. నాలుగో రోజు కూడా అదే పరిస్థితి. ఈ దశలో వ్యాక్సినేషన్ లక్ష్యం పూర్తి కావాలంటే కత్తిమీద సామే. వ్యాక్సిన్ నిర్బంధం కాకపోయే సరికి చాలామంది మనకెందుకులే అని వెనకడుగేస్తున్నారు. కరోనా భయం తగ్గిపోవడంతా అందరూ లైట్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బంది తర్వాత రెవెన్యూ, పోలీస్ డిపార్ట్ మెంట్, పారిశుధ్య కార్మికులకు టీకా ప్రక్రియ మొదలైతే.. వారిలో ఎంతమంది ముందుకొస్తారనేది ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలో ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో వేచి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: