వైసీపీ ప్ర‌భుత్వం లెక్కకు మిక్కిలిగా ప‌థ‌కాల‌తో దూసుకుపోతోంది. ఎవ‌రూ అమ‌లు చేయ‌ని ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నామ‌ని.. స‌మాజంలోని ప్ర‌తి ఒక్క‌రికీ ఏదో ఒక ప‌థ‌కం అందిస్తున్నామ‌ని, వేల కోట్ల రూపా య‌లు ఖ‌ర్చు చేస్తున్నామ‌ని.. లెక్క‌లు చెబుతోంది. అయితే.. ఏ రాజ‌కీయ పార్టీ అయినా.. ఏ కార్య‌క్ర‌మం చేసినా.. అంతిమ ప్ర‌యోజనం.. ప్ర‌జ‌ల నుంచి ఓట్లు వేయించుకోవ‌డం, మ‌ళ్లీ మ‌ళ్లీ అధికారంలోకి రావడ ‌మే. అయితే.. ఈ త‌ర‌హా వ్యూహం ఏమేర‌కు ఫ‌లితాన్ని ఇస్తుంది. నేల ‌విడిచి సాము చేయ‌డం కాదా? అనేది వైసీపీ సీనియ‌ర్ల అంత‌ర్మ‌థ‌నం.

నిజానికి ఇలానే చంద్రబాబు ప్ర‌భుత్వం కూడా అనేక ప‌థ‌కాలు తీసుకువ‌చ్చింది. పేద‌ల‌కు చేరువ అవ్వాల‌నే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ల‌ను తీస‌కువ‌చ్చింది. అయితే.. ఏ ఒక్క ప‌థ‌క‌మూ ఎన్నిక‌ల్లో పార్టీకి ఓట్లు వేయించింది లేద‌నేది గ‌త ఎన్నిక‌ల్లో స్ప‌ష్ట‌మైపోయింది. మ‌రీముఖ్యంగా మ‌హిళ‌ల‌ను టార్గెట్ చేసుకుని ఎన్నిక‌ల స‌మ‌యంలో అమ‌లు చేసిన ప‌సుపు కుంకుమ ప‌థ‌కం కూడా రివ‌ర్స్ అయింది. సో.. ప‌థ‌కాలు ఎక్క‌డా వ‌ర్క‌వుట్ కాలేద‌నే విష‌యం స్ప‌ష్టంగా తెలిసిపోయింద‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. ప్ర‌జ‌లు ఏం కోరుకుంటున్నారు? అనే విష‌యాన్ని సీఎం జ‌గ‌న్ ప‌క్క‌న పెడుతున్నార‌నేదివారి వాద‌న‌.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప‌రిస్థితులు చూసుకుంటే.. అభివృద్ధి ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. రోడ్లు ఎక్క‌డ‌కక్క‌డ గోతులు ప‌డ్డాయి. క‌నీసం ప్ర‌ధాన రోడ్లు కూడా వేయించే ప‌రిస్థితి లేకుండా పోయింది. గ్రామాలు స‌హా ప‌ట్ట‌ణాల్లో వీధి లైట్లు వెల‌గ‌డం లేదు. కొత్త‌గా డ్రెయినేజీ వ్య‌వ‌స్థ‌ను బాగు చేసింది కూడా లేదు. మౌలిక స‌దుపాయాల‌పై దృష్టి పెడితే.. అదే అనూహ్య‌మైన ఓటు బ్యాంకుగా మారుతుంద‌ని.. ఓట్ల కోసం ప్ర‌యాస ప‌డ‌న‌వ‌సరం లేద‌ని చెబుతున్నారు.

ఒక‌వేళ ప‌థ‌కాలు అమ‌లు చేసినా.. అంద‌రికీ ల‌బ్ధి చేకూరదుక‌దా? మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఓటు బ్యాంకు మాటేంట‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. మొత్తంగా జ‌గ‌న్ ఎత్తుకున్న ప‌థ‌కాల ఎజెండా బెడిసి కొడుతుంద‌ని సీనియ‌ర్లు వాదిస్తుండడం గ‌మ‌నార్హం. కానీ, ఈ విష‌యాన్ని జ‌గ‌న్ ద‌గ్గ‌ర చెప్పే ధైర్యం ఎవ‌రికీ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.  

మరింత సమాచారం తెలుసుకోండి: