మా నాయ‌కుడికి ఢిల్లీలో ఎప్పుడూ త‌లుపులు తెరిచే ఉంటాయి. ఎప్పుడు వెళ్లినా.. మా నాయ‌కుడికి అప్పా యింమెంట్ ఖ‌రార‌వుతుంది!-ఇదీ త‌ర‌చుగా వైసీపీ సీనియ‌ర్లు చెప్పుకొనే మాట‌. నిజ‌మే. గ‌తంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు కూడా ల‌భించ‌ని విధంగా సీఎం జ‌గ‌న్‌కు ఇప్పుడు ఢిల్లీ పెద్ద‌లు అప్పాయింట్ మెంట్ ఇస్తున్నారు. జ‌గ‌న్ స‌ర్కారు ఏర్ప‌డిన నాటి నుంచి ప‌రిస్తితిని గ‌మ‌నిస్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు ప‌ది సార్ల‌యినా.. జ‌గ‌న్ ఢిల్లీ పెద్ద‌ల‌ను క‌లిసి ఉంటారు. మంచిదే. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మే ఈ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లు ఉండి ఉంటే.. ప్రతి ఒక్క‌రూ హ‌ర్షించాల్సిందే.

కానీ, జ‌గన్ ఎప్పుడు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లినా.. ఆ స‌మ‌యంలో రాష్ట్రంలో ఏదో ఒక వివాదం తార‌స్థాయిలో ఉంటుండ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో రాజ‌ధాని విష‌యం తీవ్ర ర‌గడ సృష్టించిన స‌మ‌యంలో జ‌గ‌న్ ఢిల్లీలో ప‌ర్య‌టించారు. ఆ త‌ర్వాత ఎన్నిక‌ల సంఘంతో వివాదం ఏర్ప‌డి రోడ్డెక్కిన త‌ర్వాత ఢిల్లీ నుంచి పిలుపు వ‌చ్చింది. ఇక‌, తెలంగాణ‌తో తీవ్ర‌స్థాయిలో ఏర్ప‌డిన జ‌ల‌వివాదాల నేప‌థ్యంలో ఒక‌సారి ఆయ‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లాల్సి వ‌చ్చింది. అదేస‌మ‌యంలో రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు లోపించాయంటూ.. హైకోర్టు డీజీపీని పిలిపించిన‌ప్పుడు కూడా సీఎం జ‌గ‌న్ ఢిల్లీ వెళ్లారు.

ఇక‌, ఇప్పుడు.. రాష్ట్రంలోఒక‌వైపు ఎన్నిక‌ల సంఘంతో వివాదాలు న‌డుస్తున్నాయి. మ‌రోవైపు ఆల‌యాల‌పై తీవ్ర‌స్థాయిలో దాడులు జ‌రుగుతున్నాయి. ఇంకోవైపు.. తిరుప‌తి ఉప ఎన్నిక నేప‌థ్యంలో బీజేపీ దూకుడుగా ఉంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు మ‌ళ్లీ జ‌గ‌న్ ఢిల్లీ వెళ్లారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా.. ఈ స‌మ‌స్య‌ల‌పైనే అక్క‌డి పెద్ద‌లు ప్ర‌స్తావించార‌నేది బీజేపీ నేత‌ల మాట‌.

పోనీ.. ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెప్పిన‌ట్టు లేదా.. వైసీపీ నాయ‌కులు ప్ర‌చారం చేసుకున్న‌ట్టు.. అభివృద్ధి కోస‌మే వెళ్లి ఉంటే.. ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టుగా ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మొత్తంగా ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఎప్పుడు ఏపీలో వివాదం చెల‌రేగినా.. ఢిల్లీ పెద్ద‌ల నుంచి పిలుపు వ‌స్తోందంటే.. సీఎం జ‌గ‌న్‌కు వాళ్లు త‌లంటుతున్నార‌నే భావ‌న బ‌ల‌ప‌డుతోంది. మ‌రి విష‌యం ఏంట‌నేది తెలియాలంటే.. వెయిట్ చేయాల్సిందే!! 

మరింత సమాచారం తెలుసుకోండి: