కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సీఎం వైయస్‌.జగన్‌  నిన్న సాయంత్రం భేటీ అయ్యారు. సుమారు 1 గంటా 25 నిమిషాల పాటు సమావేశం జరిగింది. పోలవరం సహా పలు అంశాలపై సీఎం చర్చించారు. 2017–18 ధరల సూచీని పరిగణలోకి తీసుకుని పోలవరం ప్రాజెక్టు రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ (ఆర్‌సీసీ) సిఫార్సు మేరకు ప్రాజెక్టు వ్యయాన్ని రూ. 55,656.87 కోట్లుగా ఆమోదించాలని, ఈ మేరకు రెండవ రివైజ్డ్‌ కాస్ట్‌ ఎస్టిమేట్స్‌కు (ఆర్‌సీఈ) ఆమోదం తెలపాలని ఆయన విజ్ఞప్తి చేసారు. ఈమేరకు జలశక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు.

దీంతోపాటు పలు అంశాలపై చర్చించి, లేఖ అందించారు సీఎం జగన్. పోలవరం ప్రాజెక్ట్‌ కింద సేకరించాల్సిన భూమి 1,02,130 ఎకరాలనుంచి 1,55,465 ఎకరాలకు పెరిగిందని సిఎం పేర్కొన్నారు.  2013 భూసేకరణ, పునరావాస చట్టం కింద క్షేత్రస్థాయి సర్వే తర్వాత  భూ సేకరణలో 55,335 ఎకరాలు పెరిగిందని తెలిపారు. అలాగే ముంపు ప్రాంతాలనుంచి తరలించాల్సిన కుటుంబాల సంఖ్య  44,574 నుంచి 1,06,006కు పెరిగిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. డిసెంబర్‌ 2018 నుంచి చెల్లించాల్సిన రూ. 1,644.23 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని,  వాటిని వెంటనే చెల్లించాలని కోరారు.

ప్రాంతాల వారీగా అభివృద్ధిలో సమతుల్యతను సాధించడంలో భాగంగా అధికార వికేంద్రీకరణకు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని ఆయన స్పష్టం చేసారు. దీంట్లో భాగంగా రాజధాని కార్యకలాపాలను వికేంద్రీకరించాలని, విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధానిని, అమరావతిలో శాసన రాజధానిని, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేసింది అని తెలిపారు. ఆగస్టులో దీనికి సంబంధించిన ఏపీ అన్ని ప్రాంతాల వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధి చట్టం–2020 చేసింది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు రీ నోటిఫికేషన్‌ జారీచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అంశాన్ని 2019 ఎన్నికల్లో బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొంది అని తెలిపారు. విజయనగరం జిల్లా సాలూరులో ట్రైబల్‌ యూనివర్శిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 250 ఎకరాలను గుర్తించింది అని ఆయన తెలిపారు. ఈ ప్రాంతం సబ్‌ప్లాన్‌ ఏరియాలో ఉంది అని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: