చైనాకు చెందిన అలీబాబా  గ్రూప్ చీఫ్ జాక్ మా గత కొన్నిరోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన మీడియాలోనూ బయట ఎక్కడా కనిపించలేదు. అయితే ఆయన కనిపించకపోవడం కొన్ని రోజుల పాటు చర్చనీయాంశం అయ్యింది. దాదాపు 3 నెలల అజ్ఞాతవాసం తర్వాత తొలిసారిగా ప్రజలకు దర్శనమిచ్చారు. ఐతే ఆయన నేరుగా కనిపించలేదు. బుధవారం గ్రామీణ పాఠశాల ఉపాధ్యాయులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జాక్ మా పాల్గొన్నట్లు చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను గ్లోబల్ టైమ్స్ రిపోర్టర్ కింగ్‌ చెన్ తన ట్విట్టర్‌లో షేర్ చేశారు.

పారిశ్రామికవేత్తగానే కాదు సాంఘీక సంక్షేమ కార్యక్రమాల్లోనూ జాక్ మా ముందుంటారు. ఈ నేపథ్యంలోనే 2015 నుంచి జాక్ మా ఫౌండేషన్ ద్వారా గ్రామీణ విద్య,ప్రజా సంక్షేమం వంటి అంశాలపై ఆయన ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా ప్రతీ ఏటా గ్రామీణ ఉపాధ్యాయులకు జాక్ మా ఫౌండేషన్ అవార్డులు ప్రధానం చేస్తోంది.గత ఏడాది ఇదే కార్యక్రమాని దక్షిణ హైనాన్‌లో నిర్వహించగా.. ఈసారి కోవిడ్ కారణంగా వర్చువల్ వేదికగా నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది. తాను ఎక్కువ సమయం ఫిలాంత్రఫీ కే కేటాయిస్తానని ఆ వీడియో లో  చెప్పారు జాక్ మా.విడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాక్ మా డార్క్ బ్లూ షర్ట్‌లో కనిపించారు.


తాను కొన్ని వివాదాల్లో చిక్కుకున్నానని.. అందుకే ఎవరికీ కనిపించలేదని జాక్ మా చెప్పారు. అయితే ఆయనకు కోవిడ్ వచ్చిందని.. ఆ కారణంతోనే అజ్ఙాతంలోకి వెళ్లిపోయారని టాక్. గతంలో జాక్ మా పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తీరువల్ల ఆ దేశ ఆర్థికపరిస్థితి దిగజారిందని ఆయన ఆరోపించారు.చైనా తీసుకొచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్కరణలను గతేడాది అక్టోబర్లో షాంఘైలో జరిగిన ఓ కార్యక్రమంలో జాక్ మా తీవ్రంగా విమర్శించారు. ఆ సంస్కరణలు వ్యాపార ఆవిష్కరణలకు నష్టం చేకూరుస్తాయని ప్రసంగించారు. వృద్ధ విధానాలని ఆ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత జాక్‌మాను చైనా ప్రభుత్వం టార్గెట్ చేసింది.దానికి తోడు చైనా ప్రభుత్వం జాక్ మాకి చెందిన అలీబాబా,యాంట్స్ సంస్థలపై విచారణకు ఆదేశించడం... ఆయన్ను దేశం విడిచి వెళ్లిపోవద్దని ఆదేశాలు జారీ చేయడం... అసలేం జరుగుతోందన్న ఉత్కంఠకు తెరలేపాయి. ఎట్టకేలకు జాక్ మా తిరిగి ప్రత్యక్షమవడంతో ఆయన అదృశ్యంపై సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: