బీజింగ్: చైనా కుబేరుడు, ఆలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాతీయ ప్రభుత్వంపై, అక్కడి బ్యాంకింగ్ వ్యవస్థపై దాదాపు 3 నెలల క్రితం కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలతో చైనా ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహం కలిగింది. ఏకంగా జాక్‌ మా సామ్రాజ్యాన్నే కూలదోసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జాక్ మా ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాంతో చైనాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఏమయిపోయారు..? ఎక్కడ ఉన్నారు..? అనే అనుమానాలు సర్వత్రా తలెత్తాయి. కొంతమందైతే జాక్‌ మాను చైనా ప్రభుత్వం అరెస్టు చేసిందని, ఆయనను అక్రమంగా బంధించిందని కూడా ఆరోపణలు చేశారు. అయితే ఎట్టకేలకు జాక్ ఎక్కడున్నదీ ఈ రోజు(బుధవారం) బయటకొచ్చింది. ఈ మేరకు ఆ దేశానికి చెందిన ఓ మీడియా సంస్థ జాక్ మాకు సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది.

జాక్ మా ఎక్కడికీ పోలేదని, ఆయన క్షేమంగానే ఉన్నారని చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ బుధవారం ఓ వీడియోను విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న వందమంది ఉపాధ్యాయులతో జాక్‌మా వర్చువల్ భేటీ నిర్వహిస్తున్నారని, అందుకు ఈ వీడియోనే ఆధారంగా పేర్కొంది. ‘కరోనా మహమ్మారి ముగిసిన తర్వాత మళ్లీ మనం కలుద్దాం’ అని ఆ గ్రామీణ ఉపాధ్యాయులతో జాక్ మా అంటున్నట్లు ఈ వీడియోలో ఉంది. అయితే వ్యాపారవేత్తలు మాత్రం ఈ వీడియోపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మామూలుగా టీవీ షోలకు గానీ, సోషల్ మీడియాకు గానీ జాక్‌మా దూరంగా ఉంటారని, అలాంటిది ఆయన హఠాత్తుగా సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం అనుమానించాల్సిన విషయమేనని వారంటున్నారు.

ఇదిలా ఉంటే జాక్ మా గత అక్టోబరులో ఓ బహిరంగ సభలో టెక్నాలజీ గురించి, ఆవిష్కరణల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగానే చైనా ప్రభుత్వ ఆర్థిక విధానాలపై, బ్యాంకింగ్ రెగ్యులేటరీలపై విమర్శలు సంధించారు. దీంతో జాక్‌ మాపై చైనా ప్రభుత్వం దృష్టి సారించింది. ఆయన వ్యాపారాలపై విచారణకు ఆదేశించింది. అయితే ఆ సమావేశం తరువాత జాక్ మా మళ్లీ బయట ఎక్కడా కనపడలేదు. అంతేకాకుండా ఆయనే స్వయంగా నిర్వహించే ‘ఆఫ్రికాస్ బిజినెస్ హీరోస్’ అనే కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు. దీంతో అనేక అనుమానాలు తలెత్తాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: