అనంతపురం: టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యువ నాయకుడు పరిటాల శ్రీరామ్‌‌కు కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే. ఆయన సతీమణి గతేడాది నవంబర్ ఆరో తేదీన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. పరిటాల కుటుంబంలో మగ బిడ్డ పుట్టడంతో మరో వారసుడు దిగాడు అంటూ పరిటాల రవి, శ్రీరామ్ అభిమానులు, అనుచరులు సంబరాలు చేసుకున్నారు. అనంత పురం రాజకీయాల్లో మరో తరం సిద్దం అవుతోందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సందడి చేశారు. ఇక తాజాగా పరిటాల శ్రీరామ్ తనయుడి నామకరణోత్సవరం ఘనంగా జరిగింది.

పరిటాల శ్రీరామ్ తన కొడుకుకు ఏం పేరు పెట్టనున్నారనే దానిపై ఆయనకు కొడుకు పుట్టిన నాటి నుంచి చర్చ సాగుతూ వచ్చింది. పరిటాల శ్రీరామ్ సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రం తన తండ్రి పేరునే కొడుకుకు పెడతాడంటూ మొదటి నుంచి చెబుతూ వచ్చారు. అందరూ అనుకున్న విధంగానే పరిటాల శ్రీరామ్ తన కొడుకుకు రవీంద్ర అని తన తండ్రి పేరునే పెట్టుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పరిటాల శ్రీరామ్ తన తనయుడి పేరును పరిటాల రవీంద్ర అని ప్రకటించారు.

ఇక తన తండ్రి పేరుతో తనయుడిని పిలిచే సమయంలో పరిటాల శ్రీరామ్ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆవేదన చెంది దివంగత పరిటాల రవిని గుర్తు చేసుకున్నారు. కాగా.. పరిటాల శ్రీరామ్ గత సార్వత్రిక ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతిలో పరాజయం పొందారు. ఈ ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్‌కు 85,626 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్థి ప్రకాష్ రెడ్డికి 1,11,201 ఓట్లు పోలయ్యాయి. 2009, 2014 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పరిటాల సునీత ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత టీడీపీ ప్రభుత్వంలో పరిటాల సునీత పౌర సరఫరాల శాఖకు మంత్రిగా కూడా పనిచేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: