ఇంటర్నెట్ డెస్క్: కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపత్యంలోనే గణతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున ట్రాక్టర్ ర్యాలీని సైతం నిర్వహించేందుకు రైతులు సిద్ధమయ్యారు. అయితే ఈ ర్యాలీకి అనుమతులివ్వాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన రైతులకు పెద్ద షాక్ తగిలింది. రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని తాము అనుమతి ఇవ్వలేమని, అందుకోసం ఎలాంటి ఉత్తర్వులనూ జారీ చేయలేమని అత్యున్నత ధర్మాసనం బుధవారం ప్రకటించింది. ఈ విషయం పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఉంటుందని తెలిపింది. దీంతో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహణ రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలోనే పోలీసులతో చర్చలు సైతం నిర్వహిస్తున్నారు.

రైతు సంఘాల నేతలతో సమావేశమైన పోలీసులు ర్యాలీ రూట్ మ్యాప్‌పై చర్చిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం రోజున ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలని రైతు సంఘాలు ప్రకటించడంతో.. ఈ ర్యాలీ వల్ల వేడుకలు ఏమైనా అడ్డంకులు ఏర్పడతాయా అనే విషయంపై పోలీసులు చర్చలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రాక్టర్ ర్యాలీ ఏఏ ప్రాంతాల నుంచి వెళుతుంది, ఆ ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహిస్తే వచ్చే సమస్యలేంటి..? అనే విషయాలపై పోలీసులు రైతు సంఘ నేతలతో మాట్లాడుతున్నారు. గణతంత్ర వేడుకలకు ఆటంకం కలగకుండా ర్యాలీ ఎలా నిర్వాహిస్తారనే విషయంపై రైతుల నుంచి వివరణ తీసుకుంటున్నారు. ఈ చర్చల అనంతరం ర్యాలీకి అనుమతి లభిస్తుందా..? లేదా అనే విషయం తెలియనుంది.


ఇదిలా ఉంటే మరి కొద్ది సమయంలో వ్యవసాయ బిల్లులపై రైతు సంఘాల నేతలతో కేంద్రం పదో విడత చర్చలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. అయితే తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఆందోళనలు ఆపేది లేదని, ఇంకా ఉధృతం చేస్తామని రైతులు తేల్చి చెబుతున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం కూడా తమ వైఖరిని మార్చుకునేందుకు ఏమాత్రం సిద్ధంగా లేదు. నూతన వ్యవసాయ చట్టాలను ఎట్టిపరిస్థితుల్లోనూ రద్దు చేసేదిలేదని స్పష్టంగా చెబుతోంది. అవతసరమైతే సవరణలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, కానీ రద్దు మాత్రం అసాధ్యమని కేంద్రం తేల్చి చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: