అతనో సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. చిన్నవయసులోనే బడా ఐటీ కంపెనీలో జాబ్. లక్షల రూపాయల ప్యాకేజీ. లైఫ్ సెటిల్ ఇక తిరుగులేదు అనుకున్నారు. అతడి ఎదుగుదలకు కుటుంబ సభ్యులే కాదు, బంధువులు, స్నేహితులు కూడా ఎంతో సంతోషించేవారు. ఎలాంటి చెడు అలవాట్లు లేని అతడు లాక్ డౌన్ వల్ల వర్క్ ప్రం హోం చేస్తున్నాడు. ఖాళీ సమయం బాగా దొరికింది. టైమ్ పాస్ కోసం మొదలు పెట్టిన ఓ ఆట మొదలుపెట్టాడు. క్రమంగా దానికి బానిసయ్యాడు. ఆ ఆటే అతడి ప్రాణాన్నే బలికొంది. ఆన్ లైన్ లో బెట్టింగ్‌ ఆ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రాణాన్ని తీసింది. బెట్టింగ్ డబ్బులు కట్టడానికి జీతం సరిపోలేదు. దీంతో అప్పులు చేయడం మొదలు పెట్టాడు. అలా చేసిన అప్పులను తీర్చలేక జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన అతడి సన్నిహితులందరినీ కలిచివేసింది.
                   హైదరాబాద్ లోని పటాన్‌చెరులోని చైతన్యనగర్‌ కాలనీకి చెందిన రవికుమార్‌ (28) బెంగళూరు ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్ వేర్‌ ఉద్యోగి. లాక్‌డౌన్‌ వల్ల పటాన్‌చెరులోని ఇంట్లోనే ఉంటూ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో రవికుమార్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ల వైపు తొంగిచూశాడు. బెట్టింగ్‌ల డబ్బులు పోవడం మొదలయ్యాయి. తీవ్రంగా అప్పుల పాలయ్యాడు. ఆ విషయం తెలిసి రవి తండ్రి ప్రభాకర్‌ దాదాపు లక్ష రూపాయల అప్పు తీర్చాడు. అయినా బెట్టింగ్ డబ్బుల కోసం చేసిన అప్పులు పూర్తిగా తీరలేదు. అన్ని డబ్బులు ఎలా తేవాలా.? అని మదనపడుతూ తల్లడిల్లిపోయాడు.
                                                      తన కారణంగా కుటుంబం కూడా ఇబ్బందుల్లో చిక్కుకుంటుందని మరింత వేదనకు గురవుతూ రోజులు గడుపుతున్నాడు రవి. ఈ క్రమంలోనే రవి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి విధులకు వెళ్లగానే బెడ్‌ రూమ్‌లో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఇది గమనించిన రవి తల్లి, అతడిని రక్షించేందుకు సాయం కోసం పక్కింటి వారిని పిలిచింది. అందరూ కలిసి రవిని హుటాహుటిన దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే రవిని వైద్యులు పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లమనడంతో అక్కడికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వ వైద్యులు అప్పటికే రవి మరణించాడని చెప్పారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చేతుకొచ్చిన కుమారుడు కళ్లముందే విగత జీవిగా మారడాన్ని తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: