ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చాక అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అలా జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాల్లో మూడు రాజధానులు ఒకటి. దేశంలో ఎక్కడా లేని విధంగా జగన్, త్రీ క్యాపిటల్స్ ఫార్ములాని తెరపైకి తీసుకొచ్చారు. ఇక చంద్రబాబు ప్రభుత్వంలో అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారు. దీనికి అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్ కూడా మద్ధతు తెలిపారు.

అలాగే ఎన్నికల సమయంలో రాజధాని మార్పు గురించి కూడా ఏమి మాట్లాడలేదు. కానీ అధికారంలోకి రాగానే, ఊహించని విధంగా అమరావతిని శాసనరాజధానిగా, విశాఖపట్నంని కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలుని న్యాయ రాజధానిగా చేయాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఇక అందుకు తగ్గట్టుగానే జగన్ ముందుకెళుతున్నారు. ఇక ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు వ్యతిరేకించారు. అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలని పోరాటం చేస్తున్నారు.

అటు జగన్ ఏమో మూడు రాజధానులు ఏర్పాటు చేయాల్సిందే అని మొండిగా ముందుకెళుతుంటే, ఇటు చంద్రబాబు మూడు రాజధానులకు వద్దని, తమకు అనుకూలంగా ఉండే అమరావతినే రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఇరువురి నేతల మధ్య రచ్చ వల్ల ఏపీకి రాజధాని ఏదో తెలియకుండా పోయింది. అయితే తాజాగా రాజధాని అంశంలో ఓ ట్విస్ట్ వచ్చి పడింది. విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీసుకురావడం పెద్ద కష్టం కాకపోయినా, కర్నూలుకు జ్యూడిషయల్ క్యాపిటల్ తీసుకురావడం కష్టంలాగానే ఉంది.

ఎందుకంటే విభజన చట్టం ప్రకారం అమరావతిలో హైకోర్టుని కేంద్రం ఏర్పాటు చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చేసింది. అటు సుప్రీ కోర్టు ఆధ్వర్యంలో అమరావతిలో హైకోర్టు ఏర్పాటు అయిపోయింది. కోర్టుకు కార్యకలాపాలు కూడా ఎప్పటినుంచో జరుగుతున్నాయి. ఇక తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన జగన్, కర్నూలులో హైకోర్టును నెలకొల్పేలా రీనోటిఫికేషన్‌ ఇవ్వాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కోరారు.

అయితే ఈ రీనోటిఫికేషన్ ప్రక్రియ అంతా సులువుగా జరిగేలా కనిపించడం లేదు. మూడు రాజధానుల విషయంలోనే అనేక న్యాయ ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు కర్నూలు హైకోర్టు విషయంలో ఎన్ని ఇబ్బందులు వస్తాయో. కాబట్టి ఏపీకి మూడు రాజధానులు వస్తాయో, లేక రెండు రాజధానులు ఉంటాయో, ఇవి కాదంటే అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: