ఏపీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా వైసీపీ 151 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రజలు జగన్ మీద పెట్టుకున్న నమ్మకం వల్లే ఇన్ని సీట్లు వచ్చాయని చెప్పొచ్చు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే జనాలు పెట్టుకున్న నమ్మకానికి తగ్గట్టుగానే జగన్ పాలన చేస్తున్నారా అంటే? కాస్త అవునని, కాస్త కాదనే సమాధానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఎందుకంటే జగన్ ఎక్కువగా సంక్షేమం మీదే దృష్టి పెట్టి అభివృద్ధిని పక్కనబెట్టేశారు. అందుకే జగన్‌కు పూర్తి స్థాయిలో ప్రజల మద్ధతు దక్కడం కష్టమనే చెప్పాలి. అలా అని గతంలో టీడీపీ గొప్పగా చేసిందేమి లేదు. బాబు 2014 ఎన్నికల్లో చెప్పింది ఒకటి. అధికారంలోకి వచ్చాక చేసింది మరొకటి. అయితే బాబు ఎలాంటి పాలన చేశారో, జగన్ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో ఎప్పటికప్పుడు పెద్ద స్క్రీన్ మీద వేసి చూపించారు.

బాబు చెప్పిన మాటలకు, చేసిన పనులకు పొంతన లేకపోవడం, అలాగే సొంత పార్టీ నేతలతో భజన చేయించుకున్న వీడియోలని స్క్రీన్ మీద వేసి బాబు పరువు తీసేశారు. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. జగన్ పాలన కూడా బాబు పాలనకు ఏ మాత్రం తీసిపోకుండా సాగుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అందుకే ప్రతిపక్ష టీడీపీ, జనసేన-బీజేపీ పార్టీలు గతంలో జగన్ ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఏం చేస్తున్నారనే విషయాలని మీడియా ముందు, సోషల్ మీడియాలో వీడియోలు వేసి ట్రోల్ చేస్తున్నారు.

పెన్షన్ పెంపు, 45 ఏళ్లకే పెన్షన్, సి‌పి‌ఎస్ రద్దు, ఉద్యోగాల క్యాలెండర్, నిత్యావసర, పెట్రోల్ ధరల పెంపు, విభజన హామీలు, ప్రత్యేక హోదా, రైతు భరోసా విషయాల్లో తీసుకున్న యూటర్న్‌లు.. మరీ ముఖ్యంగా గతంలో జగన్ మద్యపాన నిషేధం, మద్యం ధరలు గురించి గతంలో ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం చేస్తున్నారనే విషయాలని ప్రతిపక్షాలు సినిమాగా చూపిస్తున్నాయి. ఇవే గాకుండా ఇన్‌సైడర్ ట్రేడింగ్, ఇసుక అంశం.. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాల్లో జగన్ ఇచ్చిన ట్విస్ట్‌లు ఏపీ పోలిటికల్  స్క్రీన్ మీదకు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: